హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): సొంతింటి కలను నిజం చేసుకోవాలని ప్రీ లాంచ్‌లో డబ్బులు కట్టిన వారిని కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు నిండా ముంచేస్తున్నాయి. తక్కువ ధరకు వస్తుందనే ఆశతో అప్పుచేసి తెచ్చి కడితే, నిర్వాహకులు కుచ్చుటోపీ పెడుతున్నారు. హైదరాబాద్‌లో ఇటీవల వరుసగా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మొన్న సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ ఘటన మరువక ముందే తాజాగా ఆర్-హోమ్స్ @ ఆర్జే హోమ్స్ 600 మందికి చేసిన రూ. 150 కోట్ల భారీ మోసం బయటపడింది.
శుక్రవారం బషీర్‌బాగ్‌లోని సీసీఎస్‌కు భారీ సంఖ్యలో బాధితులు చేరుకున్నారు. ఆర్జే బాధితులమంటూ బ్యానర్ పట్టుకొని నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సంస్థ కార్యాలయం కూకట్‌పల్లిలో ఉండడంతో సైబరాబాద్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని సీసీఎస్ పోలీసులు సూచించారు. దీంతో బాధితులు గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయానికి వెళ్లి ఈవోడబ్ల్యూలో ఫిర్యాదు చేశారు.
బాధితుల కథనం ప్రకారం.. ఆర్-హోమ్స్ రియల్ ఎస్టేట్ సంస్థకు భాస్కర్ గుప్తా చైర్మన్‌గా, ఆయన భార్య సుధారాణి డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. 2020, నవంబర్‌లో ఆర్ హోమ్స్, జై వాసవి బ్లిస్ హైట్స్ పేరుతో ఘట్కేసర్ ప్రాంతంలోని యమ్నంపేటలో ప్రాజెక్ట్ నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. ప్రీ లాంచ్ అఫర్ ధర చదరపు అడుగుకు రూ. 2199గా నిర్ణయించారు. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు క్రికెటర్లు కపిల్‌దేవ్, ఎంఎస్కే ప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్ కోటి వంటి సెలబ్రిటీలతో ప్రకటనలు గుప్పించారు.
రెండు, మూడు నెలల్లోనే అనుమతులు వస్తాయని, 2023లోగా మీకు ఫ్లాట్ సొంతమవుతుందంటూ నమ్మబలికారు. దీంతో సుమారు 600 మంది వరకు రూ. 150 కోట్ల వరకు చెల్లించారు. ఒక్కొక్కరు రూ. 20 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు కట్టారు. చెప్పిన సమయానికి పనులు ఆలస్యం కావడంతో, బాధితులు నిర్వాహకులను నిలదీశారు.
ధరణి, జీహెచ్ఎంసీ, స్టేట్ ఎలక్షన్ల కారణంగా జాప్యమంటూ దాటవేస్తూ వచ్చారు. ఇటీవలే ఆర్-హోమ్స్ కర్ధనూరు, తారామతిపేట్, సిద్ధిపేట్లలో అపార్టుమెంట్లు, సిరిగపూర్, మోర్గి, కర్ముంగిలలో ఫామ్‌ల్యాండ్స్ ప్రాజెక్ట్‌లు ప్రారంభించి, ఫ్రీ లాంచ్ అఫర్లతో కోట్లాది రూపాయలు వసూలు చేశారు. ఎక్కడా కూడా పనులు ప్రారంభించలేదు. కూకట్‌పల్లిలోని సంస్థ కార్యాలయానికి వెళ్లి నిర్వాహకులను నిలదీయగా, కొంత స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేస్తామని, డబ్బుల వాపస్ ఇస్తామంటూ చెప్పారు.
నిర్ణీత సమయానికి ఫ్లాటు ఇవ్వకపోతే, గడువు తీరిన తరువాత నెలకు రూ. 8 వేల చొప్పున కిరాయి కూడా కట్టిస్తామని నిర్వాహకులు అగ్రిమెంట్లు చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరికి చెక్కులు ఇవ్వగా, అవి బౌన్స్ అయ్యాయి. కొన్ని రోజులుగా కస్టమర్లకు చిక్కకుండా నిర్వాహకులు తప్పించుకొని తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే బాధితులు శుక్రవారం సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. అయితే బాధితులు ఎంతమంది ఉన్నారనేది స్పష్టత రావాల్సి ఉంది.