హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): జిల్లా పౌరసరఫరాల అధికారుల నిర్లక్ష్యంతో ఎఫ్‌సీఐకి కస్టమ్ మిల్లింగ్ రైస్ (బియ్యం) అందజేతలో ఆలస్యం అవుతున్నదని, మిల్లులపై అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తున్నదని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు. సీఎమ్మార్ సేకరణపై శనివారం ఎర్రమంజిల్‌లోని పౌరసఫరాల భవన్లో జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎఫ్‌సీఐ గడువు ఈ నెలాఖరుతో ముగియనున్నదని, ఈలోపు పూర్తి సీఎమ్మార్ సేకరణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లేనిపక్షంలో బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సీఎమ్మార్‌లో భాగంగా రా రైస్ ఇవ్వడంలో మిల్లర్లకు ఇబ్బంది ఉండొచ్చని, కానీ బాయిల్డ్ రైస్ ఇచ్చేందుకు ఇబ్బంది ఏంటని చైర్మన్ ప్రశ్నించారు. ఎఫ్‌సీఐకి బియ్యం అప్పగించే విషయంలో ఏదైనా సమస్య ఎదురైతే పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ లేదా కమిషనర్‌తోపాటు తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
సివిల్ సైప్లె పెట్రోల్ బంక్ ప్రారంభం
హైదరాబాద్‌లోని కవాడీగూడలో పౌరసరఫరాల సంస్థ పెట్రోల్ బంక్‌ను శనివారం రవీందర్‌సింగ్ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో బంకులు ఏర్పాటు చేయాలనే లక్ష్యం పెట్టుకోగా, తొలి విడతగా కవాడీగూడలో ఏర్పాటు చేశారు.