Fine Rice | నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 12(నమస్తే తెలంగాణ)/వేములపల్లి: రైస్‌మిల్లర్లు చెప్పిందే వేదం.. వారు వేసిందే ధర.. అధికారులకు పట్టింపు లేదు.. జిల్లా మంత్రుల జాడ కరువు.. సర్కార్ బోనస్ దేవుడెరుగు, కనీస మద్దతు ధరే పడటం లేదు.. మొత్తంగా నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో సన్నరకం ధాన్యం కొనుగోళ్లలో రైస్‌మిల్లర్ల ఇష్టారాజ్యం నడుస్తున్నది. దీంతో నిత్యం రైతులు లక్షలాది రూపాయలు నిలువు దోపిడికీ గురువుతున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతంలో ఉన్న రైస్‌మిల్లర్లు ప్రతి సీజన్లో సన్నరకం ధాన్యం కొనుగోలు చేస్తుంటారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల రైతులంతా సన్నవడ్లను దాదాపు ఇక్కడే విక్రయించేందుకు తరలి వస్తుంటారు.
గత 15 రోజులుగా యాసంగి సీజన్ సన్నాల కోతలు ఊపందుకోవడంతో నిత్యం మిల్లుల వద్దకు వందలాది ట్రాక్టర్లలో ధాన్యం తరలివస్తున్నది. ప్రారంభంలో కొద్దికొద్దిగా ధాన్యం వచ్చినప్పుడు క్వింటా సన్నాలకు రూ.2.300 నుంచి రూ.2.500 వరకు చెల్లించిన మిల్లర్లు తర్వాత సిండికేట్‌గా మారారు. 10 రోజులుగా కనీస మద్దతు ధర చెల్లించేందుకు కూడా ససేమిరా అంటున్నారు. నిత్యం వందలాది ట్రాక్టర్లలో రైతులు సన్నవడ్లను మార్కెట్లకు తెస్తుండటంతో మిల్లుల వద్ద రద్దీ ఏర్పడింది. దీంతోపాటు భారీ ధాన్యం లోడ్లను ఆసరాగా చేసుకుని మిల్లర్లు ధరను అమాంతం తగ్గించారు.
చింట్ల రకానికి మిల్లర్లు రూ.2 వేల నుంచి రూ.2,150 వరకే పెడుతున్నారు. ఇవే రకం ధాన్యానికి ప్రారంభంలో రూ.2,450 వరకు చెల్లించగా నిరుడు రూ.2,800 వరకు చెల్లించారు. రాత్రంతా వడ్లలోడ్లపైనే నిద్రించి, మర్నాడు తెల్లవారుజాము నుంచి మిల్లుల వద్ద ధాన్యం విక్రయాల కోసం బారులు తీరుతున్నారు. ఇదే రైస్ మిల్లర్లకు అదునుగా మారింది. మిల్లర్లు సిండికేట్‌గా మారడంతో మరో మిల్లు వద్దకు వెళ్లినా రైతుకు నిరాశే ఎదురవుతున్నది. మహేంద్ర చింట్ల రకం సన్నాలను గరిష్ఠంగా రూ.2,150 ధరకు కొనుగోలు చేయగా, హెచ్ఎంటీ రకం ధాన్యాన్ని రూ.2 వేల వరకే చెల్లిస్తున్నారు. గత సీజన్లో చింట్ల రకాల కంటే హెచ్ఎంటీ రకాన్ని రూ.50 తేడాతో కొనుగోలు చేయగా ప్రస్తుతం రూ.200 నుంచి రూ.300 తగ్గించి కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు.
నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై ప్రారంభంలో సమీక్షలు చేసిన జిల్లా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆ తర్వాత చేతులు దులుపుకొన్నారు. అది కూడా ఐకేపీ ద్వారా కొనుగోళ్లపైనే దృష్టిని కేంద్రీకరిస్తూ సమీక్షించారు. ఈ సీజన్లో 60శాతానికి పైగా సాగైన సన్న రకం వడ్ల కొనుగోళ్లను పట్టించుకోలేదు. సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తున్నట్టు గొప్పలకు పోతున్న మంత్రులు.. మార్కెట్లో రైతులకు మద్దతు ధర లభిస్తున్నదా? లేదా? అన్న విషయాలను అసలు పట్టించుకోవడమే లేదు. సివిల్ సైప్లయ్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూర్నగర్, ఆయన సతీమణి పద్మావతీ ప్రాతినిథ్యం వహిస్తున్న కోదాడ నియోజకవర్గాల నుంచి కూడా సన్నధాన్యం అంతా మిర్యాలగూడ రైస్ మిల్లులకే తరలివస్తుంది. అయినా వారు రైస్‌మిల్లర్ల దోపిడీని చూసీచూడనట్టు వ్యవహరిస్తుండటంపై ఆప్రాంతాల రైతులే భగ్గుమంటున్నారు.
రైస్‌మిల్లర్ల సిండికేట్ మాయజాలాన్ని నిరసిస్తూ రైతులు నిత్యం ఏదో ఒకచోట రోడ్డెక్కుతున్నారు. ఆ కొద్దిసేపే స్థానిక అధికారులు హడావుడి చేసి రైతులకు నచ్చజెప్పి అక్కడి నుంచి జారుకుంటున్నారు. దీనిపై జిల్లా యంత్రాంగం నుంచి పటిష్ఠమైన చర్యలు చేపడితే రైతులుకు లాభం జరిగేది. కేసీఆర్ సర్కా ర్ హయాంలో ఉన్న పకడ్బందీ చర్యలను ప్రస్తుతం అధికార యంత్రాంగం చేపట్టడం లేదని రైతులే విస్మయం వ్యక్తంచేస్తున్నారు.
గత కేసీఆర్ సర్కార్ హయాంలో రైతులకు అండగా ప్రతి మిల్లు వద్ద స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందాలను మోహరించేవారు. రెవెన్యూ, పోలీసు, మార్కెటింగ్, సివిల్ సప్లయ్, వ్యవసాయ, తూనికలు, కొలత శాఖల నుంచి ఒక్కొక్కరి చొప్పున ఒక టాస్క్‌ఫోర్స్ టీమ్‌ను ఏర్పాటుచేసి రైతులకు మద్దతు ధర వచ్చేలా పకడ్బందీగా వ్యవహరించేవారు. కలెక్టర్, ఎస్పీలు సైతం నిత్యం క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లి రైతులకు మద్దతు ధర దక్కేలా హెచ్చరించేవారు. మంగళవారం నుంచి పలు మిల్లుల వద్ద రెవెన్యూ అధికారులను నియమించినట్లు మిర్యాలగూడ స్థానిక సబ్ కలెక్టర్ ప్రకటించి చేతులు దులుపుకొన్నారు. కానీ వాళ్లు క్షేత్రస్థాయిలో ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు. దాంతో మిల్లర్ల దోపిడీ నిరాటంకంగా కొనసాగుతున్నది.
యాసంగిలో 20 ఎకరాల సాగు చేశాను. ఎకరానికి రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టిన. ధాన్యం అమ్ముకుందామని వస్తే రూ.2 వేల ధరే పెడుతున్నరు. మద్దతు ధర కూడా దక్కలేదు. మంత్రులేమో బోనస్ ఇస్తున్నమని గొప్పలు చెప్పుకుంటున్నరు. మద్దతు ధరకు కూడా దిక్కులేదు. మిల్లర్లు చెప్పిందే వేదమైంది. ఏ మిల్లు వద్దకెళ్లినా అందరూ కూడబల్కుకుని ధర తగ్గింస్తుండ్రు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మిల్లుల వద్ద ఆఫీసర్లను పెట్టి ధర వచ్చేలా చేసిండ్రు. ఇప్పుడు ఇటువైపు చూసేటోల్లే లేరు.
– మరిపెద్ద సైదులు, రైతు, గోదావరి గూడెం