మీడియాతో చిట్‌చాట్‌లో కిషన్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు ఏ విధంగా నష్టం జరుగుతుందో పూర్తి వివరాలతో సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రానికి లేఖ రాయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కోరారు. శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన చిట్‌చాట్ నిర్వహించారు. బనకచర్లపై కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే ఈ అంశంపై కేంద్రానికి మాట్లాడే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్రం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని చెప్పారు. గతవారం బనకచర్లపై ఏపీ సీఎం చంద్రబాబు డీపీఆర్ ఇచ్చారని, కేంద్రం ఇంకా దానిని పరిశీలించలేదని పేర్కొన్నారు. గోదావరి జలాల పంపిణీలో తెలంగాణకు అన్యాయం జరగకూడదని అన్నారు.