హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ)/ఉస్మానియా యూనివర్సిటీ: కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉస్మానియా హైరానా కొనసాగుతున్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓయూలో నీటి కొరత, కరెంట్ కోత అంశాన్ని సోమవారం ఎక్స్ వేదికగా పోస్టు చేయడం, అది వైరల్‌గా మారడం.. డిప్యూటీ సీఎంసహా వివిధ శాఖల అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి కూడా దీనిపై స్పందించి ‘ఫేక్’లో కాలేసినట్టుగా తెలుస్తున్నది. ప్రతి సంవత్సరం వర్సిటీ హాస్టళ్లు, మెస్‌లకు సెలవులు ప్రకటించడం సాధారణమేనని, నిరుడు కూడా కరెంటు కోతలు, నీటి కొరత ఉన్నట్టుగా పాత నోటీసును జత చేస్తూ ట్వీట్ చేశారు. దీనిపై ఓయూ విద్యార్థి నాయకుడు నాగేందర్రావు కొడాటి ఎక్స్ వేదికగా స్పందించాడు.
అది ఫేక్ నోటీస్ అంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, ఫేక్ నోటీసు ఎలా పోస్టు చేస్తారంటూ అసలు నోటీసు ఇది అంటూ పాత నోటీసును జత చేశారు. సీఎం పోస్టు చేసిన నోటీసులో ఈ ఏడాది మాదిరిగానే కరెంటు కోతలు, నీటి కొరత ఉన్నదని అందులో పేర్కొనగా… నాగేందర్రావు పోస్టు చేసిన నోటీసులో కేవలం ఒక నెల సమ్మర్ సెలవులు ఇస్తున్నట్టుగానే ఉన్నది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది.
సాయంత్రానికి ఓయూ పీఎస్‌లో ఫిర్యాదు
సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ట్వీట్‌పై విద్యార్థి నేత నాగేందర్రావు స్పందించి.. అది ఫేక్ నోటీసు అని ట్వీట్ చేయడంపై గంటల తరబడి సోషల్ మీడియాలో చర్చ జరిగింది. సాయంత్రం మాత్రం చీఫ్ వార్డెన్ శ్రీనివాస్ ఓయూ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి బీఆర్ఎస్ నేత, ఉస్మానియా పూర్వ విద్యార్థి మన్నె క్రిశాంక్, విద్యార్థి నాయకుడు నాగేందర్రావుపై ఫిర్యాదు చేశారు.
సోషల్ మీడియాలో ఫేక్ నోటీసును వైరల్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అసలు సీఎం రేవంత్‌రెడ్డి పోస్టు చేసిన నోటీసు ఫేకా? చీఫ్ వార్డెన్ ఫిర్యాదు చేసినట్టు నాగేందర్రావు పోస్టు చేసిన నోటీసు ఫేకా? అనే దానిపై చర్చ మొదలైంది. కాగా, రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ సోమవారం చీఫ్ వార్డెన్ శ్రీనివాస్‌కు జారీ చేసిన షోకాజ్ నోటీసు మంగళవారం రాత్రి వరకు అందకపోవడం విడ్డూరం. పైగా ‘నిర్ణీత సమయంలో సంజాయిషీ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటాం’ అని నోటీసులో రిజిస్ట్రార్ పేర్కొనగా… 24 గంటలు గడిచినప్పటికీ నోటీసు అందకపోవడం వెనక మర్మమేమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ముందుగానే నోటీసుల సేకరణ ఎందుకు?
వర్సిటీ చీఫ్ వార్డెన్ డాక్టర్ కొర్రెముల శ్రీనివాస్ సోమవారం జారీచేసిన నోటీసు వివాదాస్పదంగా మారడంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నుంచి విద్యుత్‌శాఖ, జలమండలి అధికారులు వేర్వేరు పత్రికా ప్రకటనల ద్వారా కరెంటు, నీటి సరఫరా బాగానే ఉందంటూ సమర్థించుకున్నారు.
ఈ నేపథ్యంలో గతంలో నోటీసులు ఎలా ఉన్నాయని పరిశీలించేందుకు ‘నమస్తే తెలంగాణ’ ప్రయత్నించగా.. వాటన్నింటినీ రెండు రోజుల కిందటే చీఫ్ వార్డెన్ తీసుకెళ్లారని, తమ దగ్గర వాటి తాలూకు కాపీలు కూడా లేవని సంబంధిత కార్యాలయ సిబ్బంది చెప్పడం అనుమానాలకు తావిస్తున్నది. ‘నమస్తే తెలంగాణ’ చీఫ్ వార్డెన్‌ను సంప్రదించగా… సీఎం రేవంత్‌రెడ్డి పోస్టు చేసిన పాత నోటీసు కాపీని మాత్రమే పంపారు. అసలు ప్రతి (ఒరిజినల్) కాపీని పంపాల్సిందిగా కోరితే… ఒరిజినల్ కాపీ గతంలో నోటీసు బోర్డుపై అంటించారని, తమ దగ్గర జిరాక్స్ ప్రతులే ఉన్నాయంటూ సమాధానమివ్వడం గమనార్హం.