Revanth Reddy | జనగామ, నవంబర్ 14(నమస్తే తెలంగాణ): ‘కూర్చోండి.. కూర్చోండి.. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యా రెంటీలు.. ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లో అమలు చేస్తాం.. కూర్చోండి.. ఎవరూ చప్పట్లు కొడతలేరేంది.. సోనియమ్మ మీ ఇంటికి 4వేల రూపాయలు పింఛన్ పంపిస్తది.. ఇప్పుడన్న చప్పట్లు కొట్టండి.. అరె మళ్ల లేస్తరు.. కూర్చోండి.. కూర్చోం డి.. ఏమైనా దావత్ ఉన్నదా? అట్ల వెళ్లిపోతున్న రు. ఏంది వ యా? ఇంత చప్పగనా వయా సభ పెట్టుడు’.. ఇదీ జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో కాంగ్రెస్ నిర్వహించిన విజయభేరి సభలో చోటుచేసుకున్న దృ శ్యం.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతుండగా.. జనం లేచి వెళ్లిపోవడం.. ఆయన వారిని కూర్చోమనడం.. రేవంత్ ఎన్ని చెప్పినా వినకుండా వారు మాటి మాటికీ లేవబోవటం.. ఆయన మళ్లీ వారిని కూర్చోమనటం.. తన ప్రసంగానికి జనం స్పందించకపోవడంతో.. ఆయనే అడిగి మరీ వారితో చప్పట్లు కొట్టించుకోవడం.. చివరికి సభ నిర్వాహకుల మీద విసుగుచెందడం కనిపించింది.
పేలవంగా రేవంత్ సభలు
స్టేషన్ఘన్పూర్తోపాటు, ఖిలావరంగల్‌లోని హవేలీ లక్ష్మీపురంలో మంగళవారం కాంగ్రెస్ నిర్వహించిన విజయభేరి సభలు అట్టర్‌ఫ్లాప్ అయ్యాయి. ఈ రెండు సభల్లోనూ వెనుకవైపు ఖాళీ కుర్చీలు దర్శనమివ్వగా ముందువైపు కూర్చున్న మహిళలు పదేపదే లేచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. రేవంత్ మాట్లాడుతుండగా జనం లేచి నిల్చోవడంతో నిర్వాహకులు బలవంతంగా కూర్చోబెట్టేందుకు ప్రయత్నించారు. రేవంత్ సైతం వారిని కూర్చోవాలని విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల గురించి రేవంత్ వివరిస్తుండగా జనం ఏమాత్రం స్పందించలేదు. సోనియమ్మ పింఛన్ పంపుతుంది చప్పట్లు కొట్టండి అని అడిగి మరీ చప్పట్లు కొట్టించుకున్నారు. మార్పు రావాలి.. కాంగ్రెస్ రావాలి అని తనతోపాటు నినదించాంటే జనం స్పందించకపోవడంతో అసహనానికి గురైన రేవంత్ నిర్వాహకులపై మండిపడుతూ..‘ఇంత చప్పగనా వయా’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్ స్పీచ్ ప్రారంభించకముందే మహిళలు లేచి వెళ్లిపోవటం కనిపించింది.