మహబూబ్‌గర్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి తర్వాత ఆ స్థాయిలో ఆయన కుటుంబంలో సోదరుడు తిరుపతిరెడ్డి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గానికి తిరుపతిరెడ్డినే షాడో ఎమ్మెల్యేగా చెప్పుకొంటారు. తాజాగా సీఎం రేవంత్ రెండు రోజుల కొడంగల్ నియోజకవర్గ పర్యటనకు తిరుపతిరెడ్డి దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. హకీంపేట వద్ద నిర్మిస్తున్న మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కులో భారీగా అవినీతి జరిగిందని తిరుపతిరెడ్డి వర్గం కొన్ని రోజులుగా ఆరోపిస్తున్నది. ఈ విషయంలో నియోజకవర్గంలో సీఎం రేవంత్‌కు మరో షాడోగా ఎదిగిన లీడర్‌ను వెనుకేసుకొనిరావడం తిరుపతిరెడ్డికి నచ్చడం లేదట.
సోదరుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి ఈ వివాదం వెళ్లిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా రేవంత్ పర్యటనలో తిరుపతిరెడ్డి కనిపించక పోవడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. తిరుపతిరెడ్డికి ఏకంగా క్యాబినెట్ మినిస్టర్స్‌కు మించి భద్రత కల్పించి నియోజకవర్గం మొత్తాన్ని ఆయన చేతిలో పెట్టారు. ఏమైందో ఏమో కానీ కొంతకాలంగా కొడంగల్ నియోజకవర్గంలో తిరుపతిరెడ్డి బలాన్ని తగ్గించేందుకు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యం లో లగచర్ల గొడవలకు కూడా కొంతమంది స్థానిక కాంగ్రెస్ నేతలే కారణమని.. ఆఫీసర్లపై రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారని భావిస్తున్నారు. కొంతమంది అధికారులు మరో షాడో గుప్పిట్లోకి వెళ్లి ఆయన ఏం చెబితే అది చేసే స్థాయికి వెళ్లడంతో దీనికి చెక్ పెట్టాలని తిరుపతిరెడ్డి వర్గం ప్రయత్నిస్తున్నది.
నారాయణపేట జిల్లా మద్దూర్‌లో శుక్రవారం సీఎం రేవంత్ పర్యటనతో సామాన్యులకు ఇబ్బందులు తప్పలేదు. మద్దూరులో డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించి పురోగతిని అడిగి తెలుసుకొన్నారు. సీఎంగా రేవంత్‌ను గెలిపిస్తే తామంతా అభివృద్ధి చెందుతామనుకుంటే మా వ్యాపారసముదాయాలను మూసి వేయించారని కొందరు వ్యాపారులు అసహనం వ్యక్తం చేశారు. ఉదయం సీఎం రేవంత్ మండలానికి వస్తున్నారంటే ఎంతో ఆనందపడ్డామని, కానీ మా దుకాణాలనే మూసి వేయించారని వాపోయారు. సీఎంకు బాధలు చెప్పుకొని వినతి పత్రాలు ఇవ్వాలని ఎదురు చూసిన వారికి కూడా నిరాశే మిగిలింది.
కొడంగల్ నియోజకవర్గంలో సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు పలువురు బీఆర్ఎస్ నేతలను ముందుస్తుగా అదుపులోకి తీసుకొన్నారు. తెల్లవారుజామునే మద్దూర్, కొత్తపల్లి మండలాల్లోని నేతల ఇండ్ల వద్దకు వెళ్లిన పోలీసులు, అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
దుద్యాల మండలంలోని హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించి ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.
సీఎం రేవంత్‌రెడ్డిది అరాచక పాలన అని జామియా నిజామిమా రాయదుర్గ్ వక్ఫ్ భూముల ప్రొటెక్షన్ జేఏసీ కన్వీనర్ అబ్దుల్ వాహబ్ మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి కొడంగల్ పర్యటన సందర్భంగా తనను హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గమని అన్నారు. ప్రజావ్యతిరేక విధానాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమైన ప్రజాసంఘాల నాయకుల గొంతును అణచివేసేందుకు కాంగ్రెస్ సర్కార్ అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయదుర్గ్ సర్వే నంబర్ 83/1 పరిధిలో కోట్ల విలువైన చారిత్రక జామియా నిజామియా వక్ఫ్ భూములను కాపాడేందుకు జేఏసీ పోరాటం చేస్తున్నదని తెలిపారు. కోర్టు కేసులను బేఖాతరు చేస్తూ ప్రభుత్వం టీజీఐఐసీ ద్వారా ఈ వక్ఫ్ భూముల వేలానికి పూనుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.అరెస్ట్ చేసిన నాయకులను తక్షణమే విడుదల చేసి, భూముల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.