హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): హిల్ట్ పాలసీపై పెద్ద ఎత్తున దుమారం రేగడం, అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడం, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో ప్రభుత్వ పెద్దల్లో అంతర్మథనం మొదలైనట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. అత్యంత గోప్యంగా ఉంచిన హిల్ట్ పాలసీ డ్రాఫ్ట్ కాపీ, దాని జీవో కాపీ (జీవో నెంబర్ 27) బయటికి లీక్ కావడంతో కలవరం చెందుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి నేరుగా రంగంలోకి దిగినట్టు చర్చ జరుగుతున్నది. ప్రభుత్వ చర్యలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ముఖ్యమంత్రి ప్రతిష్టను దెబ్బతీసేలా పత్రికా కథనాలు వస్తున్నాయని, మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు, సీఎంవోలో జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలు వెంటనే ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలకు, ఒక వర్గం మీడియా హౌస్‌లకు వెళ్తున్నాయని ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్‌కుమార్‌కు మౌఖిక ఫిర్యాదు అందినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
పరిపాలనాపరమైన అంతరంగిక వ్యవహారాలు, వ్యక్తిగత విషయాలు అత్యంత వేగంగా బయటికి పోతున్నాయని, ఈ కోవర్టులు ఎవరో తేల్చాలని సీఎం ఆదేశించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. కేవలం సీఎంవోలో అతికొద్దిమంది కీలక అధికారులకు మాత్రమే అందుబాటులో ఉన్న డ్రాఫ్ట్ ప్రతులు బయటికి ఎలా వెళ్లాయని, మంత్రివర్గ చర్చలు క్షణాల మీద మీడియాకు ఎట్లా వెళ్తున్నాయనే అంశాలపై దృష్టిపెట్టి విచారణ చేయాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. మంత్రివర్గంలో, సీఎంవోలో కోవర్టులు ఉన్నారని, వాళ్లను వెతికి పట్టుకోవాలని సూచించినట్టు సమాచారం. తాజాగా మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ సీఎం రేవంత్‌రెడ్డి ఇవే అంశాలను మంత్రుల వద్ద ప్రస్తావించినట్టు తెలిసింది. లీకులు ప్రభుత్వ మనుగడకు మంచిది కాదని హెచ్చరించినట్టు సమాచారం. అయినా విద్యుత్తు సంస్కరణల మీద జరిగిన చర్చ ఉన్నది ఉన్నట్టుగా ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో ప్రచురితం కావటంపై సీఎం సీరియస్ అయినట్టు తెలిసింది. హిల్ట్ పాలసీలో మంత్రివర్గ ఉపసంఘం ఆదేశాలను తాను అమలు చేశానని, కానీ ఉద్దేశపూర్వకంగానే ఏకంగా రూ.5 లక్షల కోట్ల కుంభకోణం అంటూ లీకులు వెళ్లాయని సీఎం చెప్పుకున్నట్టు తెలిసింది. కేటీఆర్, హరీశ్‌రావు పదేపదే తన మీద ఆరోపణలు చేసినా మంత్రివర్గ సభ్యుల నుంచి ఎదురు దాడి లేదని సీఎం ఆవేదన చెందినట్టు సమాచారం.
వాళ్ల మీదనే నా అనుమానం
ఇద్దరు మంత్రులు, సీఎంవోలోని ఒక సీనియర్ బ్యూరోక్రాట్‌ను అనుమానిస్తూ, వారి పేర్లను కూడా సీఎం సూచనప్రాయంగా ఇంటెలిజెన్స్ చీఫ్‌కు వెల్లడించినట్టు సమాచారం. ఆ ఇద్దరు మంత్రులు దక్షిణ తెలంగాణకు చెందినవారేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకరు తన పీఠానికి ఎసరు పెట్టి లాక్కోవటం కోసం గతంలో ఢిల్లీ స్థాయి పైరవీలు చేసిన వ్యక్తి కాగా, మరొకరు మంత్రివర్గ కూర్పు జరిగితే పదవిని కోల్పోతారనే ప్రచారంలో ఉన్న నేత అని చెప్పుకుంటున్నారు. వీరే వైరిపక్షాలకు సమాచారం ఇస్తున్నారనే అనుమానంతో ముఖ్యమంత్రి ఉన్నట్టు తెలిసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసి సీఎంవోలో కీలకంగా ఉన్న సీనియర్ ఐఏఎస్ ఒకరు బీఆర్ఎస్ నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారని, డ్రాఫ్ట్ ఈ ముగ్గురి నుంచే బయటికి వెళ్లే అవకాశం ఉందని సీఎం అనుమానిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో నీటిపారుదల శాఖలోనూ సమాచారం లీకయ్యేదని, ఇప్పుడు అక్కడ లీకేజీ తగ్గిందని ఇంటెలిజెన్స్ చీఫ్‌కు చెప్పినట్టు సమాచారం.
అనుమానితుల కదలికలపై సైబర్ నిఘా
తమ కార్యాలయాల్లో పనిచేస్తున్న దిగువ శ్రేణి సిబ్బంది, తమ చుట్టూ ఉన్న భద్రతా సిబ్బంది కూడా కోవర్టు ఆపరేషన్ చేసి, ప్రభుత్వం కదలికలను ప్రతిపక్షాలకు చేరవేస్తున్నట్టు చర్చకు వచ్చిందని సమాచారం. పాలనాపరమైన నిర్ణయాలు తన కంటే ముందుగానే ప్రతిపక్ష నేతలకు తెలిసిపోతున్నాయని, పేషీల్లో ఎవరెవరు కలుస్తున్నారు? ఏం మాట్లాడారు? అనే అంశాలు బయటకు వెళ్లడంపై ప్రభుత్వ పెద్దలు ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది. మొత్తం వ్యవహారం మీద సమగ్ర విచారణ జరిపి, కోవర్టులను గుర్తించి, లీకేజీలను కట్టడి చేయాలని సీఎం ఆదేశించినట్టు సమచారం. సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానిత వ్యక్తులకు సంబంధించిన సాఫ్ట్ డాటాను సేకరిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అనుమానితులు కూడా కీలకమైన స్థాయిలో ఉన్న వాళ్లు కావటంతో వారికి ఎటువంటి అనుమానం రాకుండా, అత్యంత గోప్యంగా సమాచారం సేకరిస్తున్నట్టు తెలిసింది. ఇందుకోసం సైబర్ క్రైం విభాగానికి చెందిన సాఫ్ట్వేర్ నిపుణులను రంగంలోకి దింపినట్టు సమాచారం. కొందరి ఈ -మెయిల్స్, వాట్సాప్ చాట్ మీద దృష్టి పెట్టి కూపీ లాగుతున్నట్టు తెలిసింది. ‘నమస్తే తెలంగాణ’తో పాటు మరో మీడియా హౌస్‌కు సంబంధించి సీఎంవో, కాంగ్రెస్ బీట్ చూసే ప్రతినిధులకు ఫోన్లు చేసి వివరాలు అడిగినట్టు సమాచారం.