హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): ఆదాయ వనరులను పెంచుకోవడం కంటే అప్పులు తెచ్చి సంక్షేమ భారాన్ని మోయడమే ఏకైక మార్గంగా భావిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరో రూ.4,000 కోట్ల రుణం కోసం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇండెంట్ పంపింది. వచ్చేనెల 2న నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ఈ నిధులను సమీకరించేందుకు రేవంత్రెడ్డి సర్కార్ సిద్ధమైంది. ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఇంకా 2 నెలలు కూడా పూర్తిగా గడవక ముందే ప్రభుత్వం ఆర్బీఐ ద్వారా రుణాలు సేకరించింది.
జూన్ 2న తెచ్చే అప్పుతో కలిపితే కేవలం 60 రోజుల్లోనే రూ.16,900 కో ట్ల రుణాలు సమీకరించినట్టు అవుతుంది. రేవంత్రెడ్డి ప్రభుత్వం ప్రతినెలా బహిరంగ మారెట్ నుంచి సగటున రూ.6 వేల కోట్లకుపైగా అప్పులు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో రూ.18,900 కోట్ల రుణాలు సమీకరిస్తామని ఆర్బీఐకి ప్రతిపాదనలు సమర్పించిన ప్రభుత్వం ఈనెల 19 నాటికే రూ. 12,900 కోట్ల అప్పులు తెచ్చింది. జూన్ తొలివారంలో రూ. 4వేల కోట్లు తెచ్చేందుకు సిద్ధమవడం ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణారాహిత్యానికి అద్దం పడుతున్నది.