ఖైరతాబాద్, మే 29: కులగణన చేపట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికల ప్రక్రియ చేపడితే మిలియన్ మార్చ్ తరహాలో పోరాటాలు నిర్వహిస్తామని బీసీ కుల సంఘా లు, మేధావుల విస్తృతస్థాయి సమావేశంలో వక్తలు స్పష్టంచేశారు. బీసీ సంక్షేమ సంఘం, బీసీ కులసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం సమావేశం జరిగింది. కులగణన, రిజర్వేషన్ల పెంపు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి మినహాయింపులు, ఆప్షన్లు ఇవ్వమని తేల్చి చెప్పారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు మాట్లాడుతూ బీహార్ రాష్ట్ర తరహాలోనే తెలంగాణలో కూడా కులగణన చేపట్టి బీసీలకు న్యాయం చేయాలని కోరారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ జూన్ 4న ఎన్నికల కోడ్ ముగిసిన రెండు మూడు రోజుల్లోనే కులగణన కోసం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సారం చేస్తే మిలియన్ మార్చ్ తరహాలో ఉద్యమిస్తామని తెలిపారు. ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ మాట్లాడుతూ పదవులు, సీట్లు అడిగే బదులు బీసీ ముఖ్యమంత్రే లక్ష్యంగా ముందుకు సాగాలని చెప్పారు. సమావేశంలో ప్రొఫెసర్ డాక్టర్ ఈ వెంకటేశ్, వివిధ బీసీ కులసంఘాల రాష్ట్ర అధ్యక్షులు బాలరాజుగౌడ్, వేముల వెంకటేశం, బైరి రవికృష్ణ, శేఖర్‌సాగర్, పూసల శ్రీనివాస్ జయంతిరావు, నరేందర్, శ్యామ్ కురుమ, నారాయణగౌడ్, బూర మల్సూర్, శ్యామల, సుజాత తదితరులు పాల్గొన్నారు.