హైదరాబాద్, అక్టోబర్17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐడీసీ)ను ఇరిగేషన్ శాఖ నుంచి వేరు చేసి, స్వతంత్ర శాఖగా తిరిగి పునరుద్ధరిస్తామని ఐడీసీ చైర్మన్ మువ్వ విజయ్‌బాబు వెల్లడించారు. ఈ మేరకు గురువారం జరిగిన బోర్డు సమావేశంలో తీర్మానించినట్టు తెలిపా రు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఐడీసీ ప్రధాన కార్యాలయంలో గురువారం బోర్డు సమావేశం జరిగింది. ఎండీ విద్యాసాగర్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో చిన్న ఎత్తిపోతల పథకాల పనితీరు, భవిష్యత్తు కార్యాచరణ అంశాలపై చర్చించారు. అనంతరం ఐడీసీ చైర్మన్ మువ్వ విజయ్‌బాబు మాట్లాడారు. 9వ షెడ్యూల్ ప్రకారం ఐడీసీని తిరిగి స్వతం త్ర శాఖగా పునరుద్ధరించాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్టు తెలిపా రు. ఐడీసీ పరిధిలో ఉన్న 643 ఎత్తిపోతల్లో దాదాపు 180కి పైగా లిఫ్ట్‌లు పూర్తిగా పనిచేయడం లేదని వివరించారు. వాటి పునరుద్ధరణకు దాదాపు రూ.400 కోట్లు అవసరమని అంచనా వేశామని తెలిపారు. ఐడీసీ లిఫ్ట్‌లను సమర్థవంతంగా నిర్వహించేందుకు లష్కర్ల నియామకంతోపాటు, సీసీ కెమెరాల ఏర్పాటుచేయాలని తీర్మానించామని చెప్పారు. కార్పొరేషన్ సెక్రటరీ రవి సుబ్రహ్మణ్యం, బోర్డు స భ్యులు లత, వినోద్, మధుసూదన్‌రావు, బీవీ కృష్ణారెడ్డి, జీఎం, ఎండీ ఆరిఫ్ పాల్గొన్నారు.