భీమారం, జూన్ 27 : బీఆర్ఎస్ స్టేటస్ పెట్టారని ఇందిరమ్మ ఇల్లు క్యాన్సిల్ చేసిన ఘటనపై కాంగ్రెస్ నాయకులు దిగివచ్చారు. మంచిర్యాల జిల్లా భీమారం మండలం పోలంపల్లికి చెందిన నక్క వేణు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీతో పాటు కేసీఆర్ ఫొటో వాట్సాప్ స్టేటస్ పెట్టినందుకుగాను బుధవారం మంత్రి వివేక్ నిర్వహించిన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇంటి ప్రొసీడింగ్‌ను ఆపేశారు. ఈ విషయమై గురువారం నమస్తే తెలంగాణ మెయిన్ పేజీలో ‘బీఆర్ఎస్ స్టేటస్..ఇందిరమ్మ ఇల్లు క్యాన్సిల్’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఇందుకు కాంగ్రెస్ నాయకులు దర్శనాల రమేశ్, బొల్లం శ్రీనివాస్, వేల్పుల శ్రీనివాస్ స్పందించి శుక్రవారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో నక్క వేణు-సనా దంపతులకు ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్‌ను అందజేశారు. ‘నమస్తే తెలంగాణ’ బాధితుల పక్షాన నిలబడి కథనం ప్రచురించగా, రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అయింది. ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్ వచ్చేలా కృషి చేసిన నమస్తే తెలంగాణకు నక్కవేణు దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.