పర్యావరణ నియంత్రణ మండలి లెక్కల ప్రకారం
ఏటా ఒక్కో మనిషి 20 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తి
దేశంలో 37.7 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తి
రీసైక్లింగ్ అవుతున్న15 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): మానవాళి, జీవజాతితోపాటు పర్యావరణానికి పెను ముప్పుగా మారిన ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ ఉత్పత్తులపై పరిశోధనలు ఊపందుకున్నాయి. ఇప్పటికే చెట్టు బెరడుతో తయారుచేసిన పేపర్ డిస్పోజబుల్స్ వినియోగంలోకి వచ్చాయి. గ్రీనరీ తగ్గించకుండా భూమిలో కలిసిపోయే వస్తువుల తయారీ తప్పని సరిగా మారింది. ఈ తరుణంలో పంట వ్యర్థాల నుంచి బయోప్లాస్టిక్ తరహా వస్తువుల తయారీపై హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) పరిశోధనలు నిర్వహిస్తున్నది. 2023 నాటికి తొలిదశ ఉత్పత్తి లక్ష్యంతో ఏడాదిగా ప్రత్యామ్నాయ ప్లాస్టిక్‌పై డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ నేతృత్వంలో ఐఐసీటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టారు. బయో ప్లాస్టిక్ వినియోగంలోకి వస్తే పర్యావరణాన్ని కబలిస్తున్న ప్లాస్టిక్‌కు అడ్డుకట్ట పడినట్టేనని పరిశోధకులు భావిస్తున్నారు.
కేంద్ర పర్యావరణ నియంత్రణ మండలి లెక్కల ప్రకారం ఏటా ఒక్కో మనిషి 20 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నట్టుగా వెల్లడైంది. ఇందులో ఏటా 8 శాతం వినియోగం పెరుగుతున్నదని తేలింది. దేశంలో ఏటా 37.7 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతుండగా, 15 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు మాత్రమే రీసైక్లింగ్ అవుతున్నాయి. మిగిలిన సగానికిపైగా వ్యర్థాలు భూ వాతావరణంలోకి చేరుతున్నాయి. 2021లోనే ప్లాస్టిక్ వినియోగంపై ప్రభుత్వం ఆంక్షలు విధించినా ఆచరణలో అమలుకావడం లేదు. ఈ క్రమంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడంతోపాటు పర్యావరణానికి లబ్ధి చేకూర్చే బయోప్లాస్టిక్ ఆవిష్కరణలపై పరిశోధకులు దృష్టిపెట్టారు.
పంట వ్యర్థాలతో బయోప్లాస్టిక్‌ను ఆవిష్కరించేందుకు ఐఐసీటీ శాస్త్రవేత్త డాక్టర్ వినీత్ అనియా నేతృత్వంలో అధ్యయనం సాగుతున్నది. ఈ పరిశోధనలకు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్థికసాయం అందిస్తున్నది. మరో ఏడాదిలోగా పరిశోధన పూర్తి కానున్నది. ప్రస్తుతం దేశంలో ఏటా 35 లక్షల టన్నుల పంట వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ వ్యర్థాలను పలు రసాయనిక చర్యల ద్వారా ప్లాస్టిక్‌గా రూపొందించనున్నారు. తద్వారా పంట వ్యర్థాల ఉత్పత్తి తగ్గడంతోపాటు పర్యావరణానికి హాని చేస్తున్న ప్లాస్టిక్, దాని రీసైక్లింగ్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోతుందని ఐఐసీటీ వర్గాలు భావిస్తున్నాయి. ఏటా ఉత్పత్తి అయ్యే పంట వ్యర్థాల్లో 11 లక్షల టన్నులు రీసైక్లింగ్ చేయాలనే పర్యావరణ లక్ష్యాన్ని ఐదేండ్లలో చేరుకొనే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అగ్రికల్చర్ వ్యర్థాల నుంచి విద్యుత్తు ఉత్పత్తికి పరిశోధనలు జరుగుతున్నాయి.