TS RERA | హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని క్రమబద్ధీకరించడంతోపాటు పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన రెరా చట్టం భేష్గ్గా ఉన్నదని హిమాచల్‌ప్రదేశ్ రెరా(రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథార్టీ) చైర్మన్ డా శ్రీకాంత్ బాల్ది అన్నారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా తెలంగాణ రెరా కార్యాలయాన్ని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా రెరా కార్యాలయంలోని అధికారులు, సిబ్బందితో ఆయన సమావేశమై తెలంగాణలో రెరా చట్టం అమలు తీరుతెన్నులు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్, ఏజెంట్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించి తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ రెరా చైర్మన్ ఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ..ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పక్షం రోజుల్లోనే పూర్తి చేస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రంలోని ఇతర నగరాలైన కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం తదితర నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం పారదర్శకతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు.