రాష్ర్టాలకు రుణాలపై ప్రత్యేక కమిటీ సిఫారసు
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాలకు రిజర్వు బ్యాంక్ అందించే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులను (చేబదులు రుణాలను) రూ.47,010 కోట్ల నుంచి రూ.51,560 కోట్లకు పెంచాలని ప్రత్యేక కమిటీ సిఫారసు చేసింది. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సుల పరిమితిపై మహారాష్ట్ర రిటైర్డ్ అడిషనల్ సీఎస్ సుధీర్ శ్రీవాత్సవ ఆధ్వర్యంలో తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ప్రధాన సభ్యుడిగా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, అస్సాం, ఒడిశా రాష్ర్టాల ఆర్థికశాఖ కార్యదర్శులు సభ్యులుగా ఆర్బీఐ ఏర్పాటు చేసిన ఈ కమిటీ తన నివేదికను విడుదల చేసింది. దీని ప్రతిని రామకృష్ణారావు శనివారం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వాలకు వనరుల లభ్యత పెరిగి పథకాలను సమర్థంగా అమలు చేసేందుకు ఉపయోగపడేలా మంచి సిఫారసులు చేశారని సీఎస్ ప్రశంసించారు. దక్షిణ భారత దేశం నుంచి ప్రాతినిధ్యం వహించి రాష్ర్టాల ప్రయోజనాలు కాపాడేలా నివేదికను అందించిన రామకృష్ణారావుకు అభినందనలు తెలిపారు.
ధరణి వినతులపై ప్రత్యేక దృష్టి : సీఎస్
ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న వినతులను పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శనివారం ఆయన బీఆర్కేభవన్ నుంచి పది జిల్లాలకు కొత్తగా నియమితులైన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నల్లగొండ, మెదక్, రాజన్న సిరిసిల్ల, వరంగల్, నాగర్‌కర్నూల్, కామారెడ్డి, జనగామ, జోగులాంబ గద్వాల, యాదాద్రి భువనగిరి జిల్లాల కలెక్టర్లకు ధరణి గ్రీవెన్స్‌ను పరిష్కరించడంపై పవర్‌పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ధరణి పోర్టల్‌ను ప్రారంభించిన ఏడాదిలోనే 8 లక్షలకుపైగా లావాదేవీలు, నాలుగు కోట్లకుపైగా హిట్లు పొందిందని చెప్పారు.