జనగామ చౌరస్తా, జూన్ 14: జనగామ జిల్లాకేంద్రంలోని ఏకశిల బీఈడీ కళాశాల ఆవరణలో బుధవారం వయోలిన్ ఆకృతిని పోలి ఉన్న ‘ది వాండరింగ్ వయోలిన్ మాంటిస్’ అనే అరుదైన కీటకాన్ని గుర్తించినట్టు ప్రముఖ చరిత్రకారుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి తెలిపారు. ఈ కీటకం దేహ నిర్మాణం ఎండిన ఆకుల వలె, సన్నని కర్ర పుల్లల మాదిరిగా ఉండి శత్రువుల నుంచి రక్షించుకోవడానికి చుట్టూ ఉన్న పరిసరాల్లో ఇట్టే కలిసిపోతుందని ఆయన పేర్కొన్నారు.
కీటకం నడక తీరు ప్రతి ఒకరికి ముచ్చటగొల్పుతుందని తెలిపారు. గాలిలో కదులుతున్న కర్ర పుల్లలాగా కనిపిస్తుందని చెప్పారు. దీని తల త్రిభుజాకారంలో ఉండి 360 డిగ్రీలు సులభంగా తిప్పగలిగిన ఏకైక జీవి అని పేర్కొన్నారు. ఈ జీవికి ఒకటే చెవి ఉండి అద్భుతమైన వినికిడి శక్తి ఉంటుందని చెప్పారు.