హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ధాన్యం వేలానికి సంబంధించిన నిబంధనల్లో పౌరసరఫరాల శాఖ పలు మార్పులు చేసింది. వేలంలో ఎక్కువ మంది వ్యాపారులు పాల్గొనేందుకు, పోటీతత్వాన్ని పెంచి సంస్థకు ఆదాయం పెంచేందుకు పలు నిబంధనలను సడలించింది. ఇప్పటికే నిరుడికి సంబంధించిన 25 లక్షల టన్నుల ధాన్యాన్ని వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి గత నెల 19న విధి విధానాలను ఖరారు చేసింది. వీటిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నిబంధనల ద్వారా స్థానిక వ్యాపారులు, మిల్లర్లకు అవకాశం దక్కదని, మార్పులు చేయాలని వినతులు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన ప్రభుత్వం నిబంధనల్లో పలు మార్పులు చేసింది. గతంలో కేవలం 6 లాట్స్‌లో ధాన్యం వేలం వేయాలని నిర్ణయించింది.
ఇందులో ఐదు లాట్స్ 4 లక్షల టన్నుల చొప్పున ఉండగా.. ఒక లాట్ ఐదు లక్షల ధాన్యం ఉంది. అయితే ఇప్పుడు దీనిలో మార్పులు చేసి ఒక లాట్ ఒక లక్ష టన్నులుగా నిర్ణయించారు. అంటే 25 లాట్స్‌లో ధాన్యం వేలం వేయనున్నారు. గత నిబంధనల ప్రకారం టెండర్లలో పాల్గొనే కంపెనీకి గడిచిన మూడేండ్లలో ప్రతిఏటా వెయ్యి కోట్ల వార్షిక టర్నోవర్‌తోపాటు రూ.100 కోట్ల నెట్‌వర్త్ కలిగి ఉండాలి. కానీ, ఇప్పుడు ఇందులో కూడా మార్పులు చేశారు. రూ. వెయ్యి కోట్ల టర్నోవర్‌ను రూ.100 కోట్లకు, నెట్‌వర్త్ విలువను రూ.100 కోట్ల నుంచి రూ.20 కోట్లకు తగ్గించారు.
ఇక వేలం తర్వాత ధాన్యం తీసుకెళ్లాల్సిన గడువును 30 రోజుల నుంచి 45 రోజులకు పెంచారు. నిబంధనల్లో మార్పులు చేయడంతో దరఖాస్తు, వేలం తేదీల్లోనూ మార్పులు చేశారు. ఈ నెల 14వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. ఈ నెల 11న జరగాల్సిన వేలం ప్రక్రియను 16వ తేదీకి వాయిదా వేశారు. నిబంధనల్లో మార్పుతో స్థానిక వ్యాపారులు, మిల్లర్లు టెండర్లలో పాల్గొనేందుకు అవకాశం లభించనున్నది. నిబంధనల సడలింపుతో ఎక్కువ మంది బిడ్డింగ్‌లో పాల్గొనే అవకాశం ఏర్పడింది.