వరంగల్ చౌరస్తా, అక్టోబర్ 17: నీట్-2022 పీజీ అర్హత కటాఫ్ స్కోర్ తగ్గిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకున్నది. దీంతో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ తెలిపింది. పీజీ అర్హత స్కోర్‌ను 25.714 పర్సంటైల్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో జనరల్ అభ్యర్థులు 24.28 పర్సంటైల్ (174 మార్కులు), ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి 14.286 పర్సంటైల్ (138 మార్కులు), దివ్యాంగులకు 19.286 పర్సంటైల్ (157 మార్కులు) సాధించిన అభ్యర్థులు అర్హత సాధించినట్టు తెలిపారు.
మెడికల్ కాలేజీల్లోని పీజీ డెంటల్ కోర్సులో యాజమాన్య కోటా సీట్ల భర్తీకి సోమవారం ఎండీఎస్ కన్వీనర్ కోటీ నోటిఫికేషన్ విడుదల చేశారు. మంగళవారం నుంచి 20 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
పీజీ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి కౌన్సెలింగ్
పీజీ వైద్య విద్య యాజమాన్య కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ సోమవారం మొదటి విడత నోటిఫికేషన్ విడుదల చేసింది. కళాశాలల వారీగా ఖాళీ సీట్ల వివరాలను వెబ్సైట్లో పొందుపరిచారు. తుది మెరిట్ జాబితాలో అర్హత సాధించిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 18వ తేదీ ఉదయం 8 నుంచి 19 సాయంత్రం 6 గంటల వరకు ప్రాధాన్య క్రమంలో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని తెలిపారు.