హయత్‌నగర్, జూలై 21 : సోషల్ మీడియాలో రీల్స్ కోసం బైక్‌పై స్టంట్‌కు పాల్పడిన ఘటనలో ప్రమాదవశాత్తు కిందపడి ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ రామకృష్ణ తెలిపిన వివరాలు.. ఎల్బీనగర్లోని సెంట్రల్ బ్యాంక్ కాలనీలో మేడ రాజు.. భార్య, కుమారుడు శివ(20), కుమార్తెతో కలిసి నివాసముంటున్నారు. శివ దిల్‌సుఖ్‌నగర్‌లోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శనివారం సాయంత్రం శివ తన స్నేహితులు సంపత్, పవన్, విజయ్‌తో కలిసి బైక్‌లపై కుంట్లూరుకు బయల్దేరారు.
శివ, సంపత్ కేటీఎం(టీఎస్07ఎఫ్‌క్యూ063)పై, పవన్, విజయ్ మరో(టీఎస్ 07జేయూ3042)బైక్‌పై వెళ్తున్నారు. మార్గమధ్యంలో శివ, సంపత్ తమ బైక్‌పై విజయవాడ జాతీయ రహదారిపై రీల్స్ కోసం స్టంట్లు చేస్తుండగా మరో బైక్‌పై ఉన్న పవన్, విజయ్ సెల్ఫోన్లో వీడియో చిత్రీకరిస్తున్నారు. సంపత్ బైక్ నడుపుతుండగా శివ వెనకాల కూర్చున్నాడు. ఈక్రమంలో బైక్ అదుపుతప్పి ముందు వెళ్తున్న స్కూటర్‌ను ఢీకొట్టి కిందపడిపోయారు. శివకు తీవ్రగాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన సంపత్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు.
మైటా నూతన కార్యవర్గం ఎన్నిక
హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ) : మలేషియా తెలంగాణ అసోసియేషన్(మైటా)నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్‌గా సైదం తిరుపతి, వైస్ ప్రెసిడెంట్‌గా చిరుత చిట్టిబాబు, మహిళా ప్రెసిడెంట్‌గా కిరణ్మయి, జనరల్ సెక్రటరీగా సందీప్‌గౌడ్, జాయింట్ సెక్రటరీగా సత్యనారాయణరావు, ట్రెజరర్‌గా సందీప్‌కుమార్, జాయింట్ ట్రెజరర్‌గా సుందర్‌రెడ్డితో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
అమెరికాలో రోడ్డు ప్రమాదం తెనాలి వైద్యురాలు మృతి
హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెనాలికి చెందిన యువ వైద్యురాలు మృతి చెందారు. గుంటూ రు జిల్లా తెనాలి ఐతానగర్‌కు చెందిన జెట్టి హారిక పశువైద్యురాలు. ఎంఎస్ చేయడానికి నిరుడు ఆగస్టులో అమెరికా వెళ్లారు. ఆదివారం ఉదయం అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్ఆర్ఐలతో సంప్రదింపులు జరిపారు.