హైదరాబాద్ సిటీబ్యూరో/బన్సీలాల్‌పేట్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన అగ్నిపథ్ ఆందోళనలో గాయపడి, గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నవారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు వెల్లడించారు. స్వల్పగాయాలైన 10మందిని ఆదివారం డిశ్చార్జ్ చేసే అవకాశముందని చెప్పారు. గాంధీలో మొత్తం 14 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతుండగా.. వారిలో బుల్లెట్ గాయాలైన మహేశ్, నాగేంద్రబాబు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. పెల్లెట్ గాయాలైన మరో ఇద్దరికి స్వల్ప శస్త్రచికిత్స చేశారు. ఈ నలుగురిని నాలుగురోజులపాటు అబ్జర్వేషన్లో ఉంచి చికిత్స అందించనున్నట్టు వైద్యులు తెలిపారు. అగ్నిపథ్ క్షతగాత్రులు చికిత్స పొందుతున్న వార్డుల్లో గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. 14మంది క్షతగాత్రుల బెడ్ల వద్ద 14 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ వార్డుల్లోకి ఎవరినీ అనుమతించడం లేదు.
ఆగని నిరసనలు
ఉస్మానియా యూనివర్సిటీ/దుండిగల్, జూన్ 18: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. తక్షణమే అగ్నిపథ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శనివారం వేర్వేరుగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఎన్సీసీ గేటు వద్ద కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, విద్యార్థి నాయకులకు మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది.