హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): ఎగువన భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు శనివారం ఒక్కరోజే 4.10 లక్షల క్యూసెక్కుల వరద చేరింది. గడిచిన పదేండ్లలో ఒక్కరోజులో ఇంతటి ప్రవాహం రావడం ఇదే తొలిసారి అని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. కృ ష్ణాతోపాటు గోదావరి నదిలోనూ ఇన్‌ఫ్లోలు ఒక్కసారిగా పెరిగాయి. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకుగానూ ప్ర స్తుతం 588.90 అడుగులు ఉన్నది. శనివారం 26గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కిన్నెరసాని ప్రాజెక్టులోకి భారీగా వరద చేరింది.
కృష్ణమ్మ ఉగ్రరూపం
కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. కర్ణాటక రాష్ట్రంలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు భారీ వరద వస్తున్నది. శనివారం జూరాల ప్రాజెక్టుకు 3.36 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది.
మేడిగడ్డకు 1.40లక్షల క్యూసెక్కుల నీరు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్‌కు 1.40 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తున్నది. మొత్తం 85 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. అన్నారం బరాజ్‌కు మానేరు, చిన్నచిన్న కాలువల ద్వారా 3,800 క్యూసెక్కుల నీరును వస్తుండగా, మొత్తం 66 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు.
కాళేశ్వరం వద్ద నిలకడగా గోదావరి
మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి నిలకడగా పారుతున్నది. పుష్కర ఘాట్ వద్ద గోదావరి ప్రాణహితతో కలిసి 1.40 లక్షల క్యూసెక్కులుగా 5.67 మీటర్ల ఎత్తులో పారుతూ మేడిగడ్డ బరాజ్ వైపు పరుగులు తీస్తున్నది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమ్మక్క బరాజ్ వద్ద గోదావరి ప్రవాహం మళ్లీ పెరుగుతున్నది.
ఏపీలో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ మొగల్రాజపురంలో సున్నపుబట్టి సెంటర్ వద్ద కొండచరియలు విరిగిపడి నలుగురుప్రాణాలు కోల్పోయారు.