హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెనుకబడిన వర్గాలను చిన్నచూపు చూస్తున్నదని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు ధ్వజమెత్తారు. బీసీల పట్ల ఇంత నిర్లక్ష్యం ఎందుకని నిలదీశారు. రూ.40 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో బీసీలకు వెయ్యి కోట్లలోపే కేటాయింపులు జరపడం ఎంతవరకు సబబని శనివారం ప్రధాని మోదీకి రాసిన బహిరంగ లేఖలో ప్రశ్నించారు. కులగణన చేస్తామని హామీ ఇచ్చి ఆ తర్వాత చేయబోమని మాట మార్చడం బీసీలను వంచించడమేనని విమర్శించారు. రాజ్యాంగంపై కూడా మోదీకి గౌరవం లేదని, రాజ్యాంగ బద్ధమైన జాతీయ బీసీ కమిషన్‌ను నెలల తరబడి నియమించకపోవడం బీసీల పట్ల మోదీకి ఉన్న కపట ప్రేమకు నిదర్శనమని తెలిపారు. కులగణన చేయాలన్న ఓబీసీ పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫారసును మోదీ సర్కార్ బుట్టదాఖలు చేయడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు గల్లంతవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికే రోల్‌మాడల్ అని మోదీ చెప్తున్న గుజరాత్లో సైతం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలవుతున్న రిజర్వేషన్లు కేవలం 10 శాతమేనని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం కొత్త పథకాలను ప్రవేశపెట్టాలన్న విషయాన్ని మోదీ ఎన్నడో మరిచిపోయారని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం దేశంలో తెలంగాణ మాత్రమే బడ్జెట్లో 40 శాతం కేటాయింపులు జరుపుతున్నదని కృష్ణమోహన్‌రావు ప్రశంసించారు.