హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ ) : వాయు కాలుష్య నియంత్రణపై హైదరాబాద్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్టు బయోడైవర్సిటీ శాస్త్రవేత్తలు శుభవార్త చెప్పారు. తాము నిర్వహించిన పరిశోధనల్లో దుమ్ము, వాయు కాలుష్యాన్ని తగ్గించే కొన్ని జాతుల చెట్లను గుర్తించినట్టు వెల్లడించారు. అటవీ జీవవైవిధ్య సంస్థ పరిశోధన బృందం సమన్వయకర్త పంకజ్ సింగ్, జీవవైవిధ్యం, వాతావరణ మార్పుల శాస్త్రవేత్త, డీన్ భారతీ పటేల్ల నేతృత్వంలో జరిగిన ఈ అధ్యయనంలో ప్రధానంగా మర్రి, వేప, కానుగ, ఆర్కిడ్ జాతి చెట్లు అత్యంత సమర్థవంతంగా వాయుకాలుష్యాన్ని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని నిర్ధారించింది. ఈ చెట్లు దుమ్మును ఒడిసిపట్టుకోగలవని, గాలిలోని ధూళిని తట్టుకొని ఎదగగలవని పరిశోధనలో వెల్లడైనట్టు పేర్కొన్నది.
హైదరాబాద్ శివారులోని దూలపల్లి, బొల్లారం పారిశ్రామిక అభివృద్ధి ప్రాంతం, మేడ్చల్ హైవే తదితర ప్రాంతాల్లోని పలు చెట్ల జాతుల నుంచి శాస్త్రవేత్తలు జీవరసాయ నమూనాలను సేకరించారు. మర్రి, వేప, ఆర్కిడ్, కానుగ చెట్లు వాయుకాలుష్య నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు గుర్తించారు. పారిశ్రామిక ప్రాంతాలతోపాటు ప్రధాన హైవేల వెంట అవెన్యూ ప్లాంటేషన్లుగా ఈ జాతుల మొక్కలను నాటడంతో సత్ఫలితాలను పొందొచ్చని అటవీశాఖకు సూచించారు. కాగా, వాయుకాలుష్య తీవ్రతను తెలియజేయడంలో వరగోగు (సొగసుల చెట్టు)జాతి చెట్లు ప్రధానపాత్ర పోషిస్తున్నాయని పరిశోధనలో వెల్లడైంది.