హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 1 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నంలో మంగళవారం ఉదయం కాల్పుల ఘటన కలకలం రేపింది. కర్ణంగూడ గ్రామంలో ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ఈ జంట హత్యల కేసు దర్యాప్తును రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎల్బీనగర్కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి, అంబర్‌పేట్‌కు చెందిన రాఘవేంద్రరెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారులు. మూడు నెలల కిందట వీరు కర్ణంగూడ గ్రామంలో ఎనిమిది ఎకరాల భూమిని తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు. ఈ క్రమంలో వారు రోజూ అక్కడికి వెళ్లి పనులను పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం కూడా ఉదయం 6 గంటలకే వారు అక్కడికి వెళ్లి తిరిగి 8.30 గంటలకు వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో కారు నడుపుతున్న రాఘవేంద్రరెడ్డి ఛాతీలో బుల్లెట్ దిగి, వెంటనే స్పృహ కోల్పోయాడు.
పక్కనే ఉన్న శ్రీనివాస్‌రెడ్డి కారు దిగి పొదల్లోకి పారిపోతుండగా.. దుండగులు అడ్డగించి అతి సమీపం నుంచి కంట్లో కాల్పులు జరిపారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాలను దవాఖానకు తరలించారు. వీరు అభివృద్ధి చేస్తున్న స్థలం పక్కనే కర్మన్‌ఘాట్‌కు చెందిన మట్టారెడ్డి స్థలం ఉన్నది. కాల్పుల ఘటనకు ముందు వారు మట్టారెడ్డితో మాట్లాడి బయలుదేరినట్టు తెలిసింది. పోలీసులు మట్టారెడ్డిని, హఫీజ్, కృష్ణ అనే మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. హఫీజ్ శ్రీనివాస్‌రెడ్డి అనుచరుడు కాగా, కృష్ణ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మృతులకు ఇంకా ఎవరైనా శత్రువులు ఉన్నారా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ జంట హత్యల మిస్టరీని ఛేదించేందుకు 5 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. డాగ్ స్కాడ్, క్లూస్‌టీం అధికారులు పలు కీలక ఆధారాలను సేకరించారు ఐటీ అధికారులు సాంకేతిక పరిజ్ఞానంతో సీసీ కెమెరాలు, కాల్స్ డాటాను విశ్లేషిస్తున్నారు.