Director Health | డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌గా డాక్టర్ రవీంద్ర నాయక్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ముందు డీహెచ్గా కొనసాగిన గడల శ్రీనివాసరావును ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ క్రమంలో ఆయన విధుల నుంచి రిలీవ్ అయ్యారు. కొత్త డీహెచ్గా రవీంద్ర నాయక్ బాధ్యతలు స్వీకరించారు. అలాగే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యకేషన్గా రమేశ్‌రెడ్డి స్థానంలో త్రివేణిని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రజారోగ్య సంచాలకులుగా ఐదేళ్లకుపైగా సేవలందించి, తెలంగాణ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ సమయంలో మెరుగైన వైద్య సేవలు అందించడంతోపాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడగలిగామన్నారు. వైరస్ కట్టడి కోసం అహర్నిశలు పని చేసి, సాధ్యమైనంత తక్కువ నష్టంతో రాష్ట్రాన్ని మహమ్మారి నుంచి కాపాడుకోగలిగామన్నారు. అందరి సహకారం వల్లే ఇది సాధ్యమైందని.. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో తెలంగాణ ప్రజారోగ్య రంగాన్ని మరింత పటిష్టం చేయడానికి పని చేస్తానన్నారు. ఇంతకాలం తనకు సహకరించిన వివిధ జిల్లాల వైద్య అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి నమస్కారాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.