ఖైరతాబాద్, నవంబర్ 2: అరుదైన గుండెవ్యాధితో బాధపడుతున్న ఓ యువకుడికి నిమ్స్ వైద్యులు ప్రాణదానం చేశారు. శనివారం నిమ్స్ దవాఖానలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి సతీశ్ వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన బానోతు అశోక్(20)కు పుట్టుకతోనే గుండె సమస్య వచ్చింది. అప్పుడు ఓ ప్రైవేట్ దవాఖానలో ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి ఉపశమనం కలిగించారు. పదేండ్ల తర్వాత సమస్య మళ్లీ వచ్చింది. వివిధ దవాఖానల్లో చూపించినా సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకలేదు. ఓ కార్పొరేట్ దవాఖానలో చికిత్సకు కనీసం రూ.35లక్షల ఖర్చు వస్తుందని చెప్పడంతో చివరాశగా నిమ్స్‌లో చేర్పించారు. అశోక్ గుండె కవాటం (పల్మనరీ వాల్వ్)దెబ్బతినడం వల్ల పంపింగ్ అయిన రక్తం వెంటనే వెనక్కి వస్తుంది. ఏ మాత్రం శ్రమ చేసినా హార్ట్ రేట్ పెరిగిపోవడంతో పాటు శరీరం మొత్తం నీలి రంగులోకి మారిపోతుంది.
దేశంలో 29 నుంచి 32 మిల్లీమీటర్ల వాల్వ్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. నిమ్స్ వైద్యులు కృత్రిమ గుండె కవటాలను రూపొందించే సంస్థను సంప్రదించి 35 మిల్లీమీటర్ల వాల్వ్‌ను మూడు నెలల్లో తయారు చేయించారు. దీనికి మై వాల్వ్ అని నామకరణం చేశారు. ఈ సైజు వాల్వ్‌ను తయారు చేయడం దేశంలోనే తొలిసారి అని వైద్యులు తెలిపారు. 35 మిల్లీమీటర్ల ఉన్న కృత్రిమ పల్మనరీ వాల్వ్‌ను డాక్టర్ సాయి సతీశ్ నేతృత్వంలో డాక్టర్ హేమంత్, డాక్టర్ శైలేష్ భాటియా, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ అమర్నాథ్, డాక్టర్ త్యాగి, డాక్టర్ అద్నాన్‌లు ఓ బెలూన్ మీద అమర్చి ట్రాన్స్కేథటర్ను ఫ్యుమరల్ వేయిన్స్ ద్వారా గుండెలో జాగ్రత్తగా అమర్చారు. రెండున్నర గంటలు నిర్వహించిన ఈ శస్త్రచికిత్సను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పూర్తిగా ఉచితంగా నిర్వహించారు. 35 మిల్లీమీటర్ల కృత్రిమ పల్మనరీ వాల్వ్‌ను అమర్చడం దేశంలోనే తొలిసారి అని సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి సతీశ్ తెలిపారు. రోగికి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రావని.. సాధారణ జీవితాన్ని గడపవచ్చని డాక్టర్ భరోసానిచ్చారు.