హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): బీజేపీ నేతలు జిట్టా బాలకృష్ణారెడ్డి, రాణి రుద్రమ ఆస్తుల వేలానికి బ్యాంకు నోటీసులు వచ్చాయి. లక్ష్మీవిలాస్ బ్యాంకు నుంచి 2021 సెప్టెంబర్ 21న ఆరు సంస్థలు కలిసి రూ.16.94 కోట్లు రుణం తీసుకొన్నాయి. ఇందులో జిట్టా బాలకృష్ణారెడ్డి, రాణిరుద్రమకు చెందిన సంస్థలు కూడా ఉన్నాయి. వీరిద్దరూ కలిసి ఇందులో ఐదు సంస్థల అప్పులకు గ్యారంటీ ఇచ్చారు. దీనిని బట్టి ఆ సంస్థలు వీరివేనని స్పష్టమవుతున్నది. బ్యాంకు నుంచి రుణాలు బాగానే తీసుకున్నా.. తిరిగి చెల్లించే సమయానికి వారు చేతులెత్తేశారు.
ఏడాదిన్నర గడుస్తున్నా.. ఆరు సంస్థలు తీసుకొన్న రుణాలను ఇప్పటివరకు చెల్లించకపోవడంతో కుదువపెట్టిన ఆస్తులను జప్తు చేసి, వేలం వేయాలని బ్యాంకు నిర్ణయించింది. ఈ మేరకు లక్ష్మీ విలాస్ బ్యాంకు తరఫున కంపెనీలో ట్రస్టీ అయిన ‘రిలయన్స్ అస్సెట్ రి కన్స్ట్రక్షన్’ సంస్థ రంగంలోకి దిగింది. వారికి చెందిన దాదాపు రూ.18 కోట్ల ఆస్తులను వేలానికి ఉంచుతూ తాజాగా నోటీసు ఇచ్చింది. ఈ నెల 27న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఆస్తి తనిఖీ ఉంటుందని, రెండో తేదీన మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య ఈ వేలం ఉంటుందని రిలయన్స్ వెల్లడించింది. కాగా, జిట్టా, రాణిరుద్రమ కలిసి తీసుకొన్న రుణంతో నాగోల్ సమీపంలో ఒక వెంచర్ ఏర్పాటు చేశారని, నష్టాలు రావడంతో అప్పు కట్టలేని స్థితికి చేరుకొన్నారని సమాచారం.
రాణి రుద్రమ, జిట్టా బాలకృష్ణారెడ్డి వ్యవహారం రాజకీయ వర్గాలతోపాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బ్యాంకు రుణ ఎగవేతదారులకు బీజేపీ అడ్డాగా మారిందని నెటిజన్లు విమర్శించారు. బ్యాంకు నుంచి అప్పు తీసుకొని కట్టలేనివాళ్లంతా కాషాయ కండువా కప్పుకొంటున్నారని ఎద్దేవా చేశారు. పైగా.. జిట్టా బాలకృష్ణారెడ్డి వర్గం ఇచ్చిన సంజాయిషీ హాస్యాస్పదంగా మారింది.
బ్యాంకు నుంచి రుణం తీసుకొని వ్యాపారంలో పెట్టుబడి పెట్టామని, కొవిడ్ కారణంగా వ్యాపారం సాగక నష్టపోయామని చెప్పడంపై నెటిజన్లు చురకలంటించారు. వారు 2021లో బ్యాంకు రుణం తీసుకొన్నారని, అప్పటికి కొవిడ్ రెండో వేవ్ పూర్తై, వ్యాపారాలు పుంజుకొన్నాయని, అయినా కొవిడ్‌ను బూచిగా చూపి సానుభూతి దండుకొనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.