వరంగల్‌చౌరస్తా, డిసెంబర్ 5 : కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్‌గా డాక్టర్ రమేశ్‌రెడ్డిని నియమిస్తూ వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జరిగిన పీజీ పరీక్షల్లో అక్రమాలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై వీసీ నందకుమార్‌రెడ్డి రాజీనామా సమర్పించడంతో కొంతకాలంగా వీసీ పోస్టు ఖాళీగా ఉండటంతో యూనివర్సిటీ పాలనావ్యవహారాలు నిలిచిపోయాయి. పూర్తిస్థాయి వైస్ చాన్స్‌లర్‌ను నియమించే వరకు రమేశ్‌రెడ్డి బాధ్యతల్లో ఉండనున్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన యూనివర్సిటీ పరిపాలనా భవనంలో ఇన్చార్జి వీసీగా బాధ్యతలు చేపట్టారు. గతంలో డీఎంఈగా బాధ్యతలు నిర్వహించిన ఆయన ప్రస్తుతం యాదాద్రి భువనగిరి ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు.