Ramesh Karthik Nayak | జూపల్లి రమేశ్ / నిజామాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తాను పుట్టి పెరిగిన తండాలో గిరిజనుల శ్రమైక జీవనం, వారి బతుకు వెతలు, సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార, వ్యవహారాల సునిశిత పరిశీలన అతడి మనసును తట్టిలేపింది. పాఠశాల స్థాయి నుంచే ‘అక్షర సేద్యం’ చేసేలా తీర్చిదిద్దింది. తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహంతోడై కలమనే నాగలితో నూనుగు మీసాల వయస్సులోనే రచనలకు బీజం పడింది. గిరిజనుల జీవితాలపై అతడి రచనలు అనతి కాలంలోనే పుస్తకాలుగా ప్రచురితమై జాతీయ స్థాయిలో ప్రసిద్ధి పొందాయి. పాతికేండ్ల ప్రాయంలోనే ఎవరూ సాధించలేని ఘనతను సాధించిపెట్టాయి. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం వివేక్‌నగర్ తండాకు చెందిన రమేశ్ కార్తీక్ నాయక్, ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి ఎంపికవడం సాహితీప్రియులను ఆనందంలో ముంచెత్తింది. అతడు రాసిన వచన కవితా సంపుటి ‘బల్దేర్ బండి’లోని ‘జారేర్ బాటి (జొన్న రొట్టెలు)’ కవిత కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ తెలుగు పాఠ్య పుస్తకంలో ముద్రితమైంది. ‘బల్దేర్ బండి’ సంపుటిలోని కవితలు ఏపీలోని ఆంధ్రా విశ్వవిద్యాయం పీజీ తెలుగు పాఠ్యాంశంలో చోటు దక్కించుకున్నాయి.
పదో తరగతి నుంచే సాహిత్యసేవ
రమేశ్ కార్తీక్ నాయక్ది సాధారణ వ్యవసాయ కుటుంబం. నునావత్ మోజీరాం, సేవంతాబాయి దంపతులకు మొదటి సంతానం. 1997, డిసెంబర్ 14న జన్మించిన అతడి అసలు పేరు నునావత్ కారీర్తిక్. తెలుగు, ఇంగ్లిష్‌లో కథలు, వచనా కవిత్వం, అనువాదం వంటి విభాగాల్లో చిన్నతనంలోనే సాహితీవేత్తగా గుర్తింపు పొందాడు. పదో తరగతి నుంచే కవిత్వం రాయడం అలవాటుగా మార్చుకున్న కార్తీక్ నాయక్, గిరిజనుల జీవితాలు, మనస్తత్వాలు, కష్టసుఖాలను కవిత్వాలు, కథలుగా మలిచి ఆకట్టుకున్నాడు. ఒకటి నుంచి పదో తరగతి వరకు నిజామాబాద్ జిల్లాలోనే విద్యనభ్యసించాడు. బడిలో విద్యా సంబంధిత, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. ఓ వైపు రచనలను కొనసాగిస్తూనే మరోవైపు చదువుపై ఏకాగ్రత సడలనివ్వలేదు. మేడ్చల్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమాలో చేరి, అది పూర్తికాకముందే బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుంచి దూరవిద్యలో బీఏ పూర్తి చేశాడు. కూకట్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రైవేట్‌గా ఇంటర్ హెచ్ఈపీ, ఎంఎన్ఆర్ కళాశాలలో డీఎడ్ చదివి ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ నుంచి స్పానిష్ భాషలో డిప్లొమాలో చేరాడు. రెండో ఏడాదికి ఉత్తీర్ణత సాధించినా ఆర్థిక ఇబ్బందుల వల్ల కొనసాగించలేదు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంగ్లిష్‌లో ఎంఏ పూర్తి చేసిన అతడు, ప్రస్తుతం ఓయూలోనే ఎంఏ తెలుగు చదువుతున్నాడు. 2023లో ప్రైవేట్ కళాశాలలో ఇంగ్లిష్ అధ్యాపకుడిగా పని చేశాడు. ప్రస్తుతం దూరదర్శన్‌లో ‘అక్షరం’ అనే సాహిత్య కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.
ప్రతి రచనకూ ప్రజాదరణ
రమేశ్ కార్తీక్ నాయక్ రచనలు ఒక్కోటి ఒక్కో ప్రాధాన్యతతో ప్రజాదరణ పొందాయి. మొదటి కవితా సంపుటికి రమేశ్ 2014లోనే శ్రీకారం చుట్టాడు. తాను చూసిన సంఘటనలు, మనుషులు, సేకరించిన పుస్తకాల్లో ఉన్న అనేక విషయాలను తెలుసుకుని తొలి రచన పూర్తి చేశాడు. గిరిజన బతుకులు, వెతలనే కవితలు, కథలుగా చెప్పాలనుకున్నాడు. ఈ క్రమంలో రమేశ్ రాసిన ‘బల్దేర్ బండి’ కవితా సంపుటి 2018లో ప్రచురితం కాగా, 2019 జనవరిలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వచన కవితా సంపుటి సాహితీప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నది. ఇంగ్లిష్, హిందీ, కన్నడ, మలయాళం, బంగ్లా భాషల్లోకీ అనువాదమైంది. 2021లో ‘డావ్లో’ పేరుతో తీసుకొచ్చిన కథల సంపుటిలో గోర్ బంజారా కథలను అద్భుతంగా అక్షరీకరించాడు. ఈ సంకలనంలోని ‘పురుడు’ కథ ఆంగ్లంలోకి అనువాదమై ‘ఎక్సేంజెస్’ సాహిత్యానువాద జర్నల్‌లోనూ ప్రచురితమైంది. 2022లో ఆచార్య సూర్యధనుంజయతో కలిసి సహ సంపాదకీయంలో ‘కేసులా’ పేరుతో తొలి గోర్ బంజారా కథలు రాశాడు. 2023లో ‘చక్మక్’ అనే ఇంగ్లిష్ కవితా సంపుటి రచించాడు.
వరించిన పురస్కారాలు
2017లో ‘కలహంస’ పురస్కారం, 2018లో తెలంగాణ రాష్ట్ర స్థాయి సాహితీ పురస్కారం (బోధన్‌లో), 2019లో మువ్వా రంగయ్య ఫౌండేషన్ వారి ‘నవ స్వరాంజలి’ సత్కారం, 2019లోనే ‘చిలకమర్తి లక్ష్మీనరసింహం’ సాహితీ పురస్కారం, 2020లో ‘బీఎస్ రాములు’ ప్రతిభా పురస్కారం, 2021లో ‘బంజారా యూత్ ఐకాన్’ అవార్డు, 2023లో ‘రావిశాస్త్రి కథా పురస్కారం’ వరించాయి. గతేడాది నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో ‘హరిదా యువ సాహిత్య’ పురస్కారాన్ని అందుకున్నాడు. ఈ యువ సాహితీవేత్త అక్షర సేవలకు గాను 2024 జూలై 15న ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం దక్కింది.
ఈ అనుభూతి వర్ణించలేనిది
కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం దక్కడం చాలా సంతోషంగా ఉంది. 26 ఏండ్ల వయస్సులోనే ఈ ఘనతను సాధించడం గొప్పగా ఉంది. గిరిజనులతో ఏమవుతుందిలే అనుకున్న వారికి ఈ అవార్డుతో సమాధానం దొరుకుతుంది. నేను పుట్టి పెరిగిన వాతావరణం, మా గిరిజనుల శ్రమైక జీవనం ఆధారంగా నేను రచించన కవితలే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. చిన్నప్పటి నుంచి కండ్లెదుట కనిపించిన వాస్తవిక ఘటనలను నా రచనల్లో పొందుపర్చాను. సమాజంలో అందరికీ ఉపయోగపడే సాహిత్యాన్ని అందించి మనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవడమే నా లక్ష్యం.
– రమేశ్ కార్తీక్ నాయక్, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత