Ramappa Temple | వరంగల్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రపంచ వారసత్వ సంపదగా నిలిచిన రామప్ప ఆలయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఇప్పుడు మానవ ముప్పును ఎదుర్కొంటున్నది. సింగరేణి కాలరీస్ కొత్తగా రామప్ప ఆలయం సమీపంలో ఓపెన్ కాస్టు మైనింగ్‌ను మొదలుపెట్టేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తుండడంతో దాని మనగుడ ప్రమాదంలో పడింది. ఇది మొదలైతే రామప్ప ఆలయానికి వచ్చే వారు పూర్తిగా తగ్గిపోనున్నారు. ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఉన్న ఇక్కడికి పర్యాటకులు వచ్చే పరిస్థితి ఉండదు. మరోవైపు సర్కారు నిర్లక్ష్యం, భద్రతాలేమితో రామప్పతోపాటు దీని పరిసరాల్లోని ఉపాలయాలు శిథిలమవుతున్నాయి. సరైన భద్రత లేకపోవడంతో గుప్త నిధుల వేటలో రాతి కట్టడాలు నేలకూలుతున్నాయి. రాజుల చరిత్ర శాసనాల్లో ఉంటే వారి కాలంలో నిర్మించిన అద్భుత శిల్పకళ సంపద మట్టిలో కలిసిపోతున్నది. నిత్యం అభిషేకాలు, పూజలతో ఆధ్యాత్మికతను ప్రపంచానికి చాటిన దేవాలయాలు, శిల్పాలు రాళ్ల కుప్పలవుతున్నాయి. శతాబ్దాలనాటి జీవకళను తెలియజెప్పే ఘనకీర్తి గల చారిత్రక ఆలయాలు ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ప్రభను కోల్పోతున్నాయి.
యునెస్కో గుర్తింపు వచ్చినా..
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలో రామప్ప ఆలయం ఉన్నది. కాకతీయుల కళావైభవానికి, ఆధ్యాత్మిక చింతనకు నిదర్శనంగా ఉన్న రామప్ప ఆలయం చుట్టూ పకల కిలోమీటరు పరిధిలోనే మరో 20 ఉపాలయాలను నిర్మించారు. కాకతీయుల అద్భుత కళానైపుణ్యం ఉట్టిపడే రామప్ప ఆలయానికి 2021 జూలైలో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) గుర్తింపు వచ్చింది. అప్పటి వరకు ఎలా ఉన్నా ఆ తర్వాత దీని ప్రభ మరింత పెరుగాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న రామప్ప ఆలయం అభివృద్ధికి నోచుకోకపోగా ఉన్న కట్టడాలు కూలిపోతున్నాయి.
శిథిలిమవుతున్న ఆలయాలు
కాకతీయుల కాలంలో రామప్ప ఆలయంతోపాటు దీనిని ఆనుకుని కాటేశ్వర, కామేశ్వర, నరసింహస్వామి, నంది మంటపాన్ని నిర్మించారు. రామప్ప చుట్టున్న కోటగోడ లోపల గొల్లగుడి, యాకూబ్ సాబ్ గుడి, త్రికూటాలయం, అడవిలో మరో రెండు శివాలయాలు ఉన్నాయి. రామప్ప చెరువు కట్టపై కల్యాణ మంటపం, త్రికూటాలయం (కాటేజీల పకన), మరో రెండు చిన్న ఆలయాలు ఉన్నాయి. పాలంపేటలో ఉన్న మరో రెండు శివాలయాలు శిథిలమవుతున్నాయి. ఆదరణ లేకపోవటంతో ఆలయంలోని శిల్పాలు మట్టిలో కలిసిపోతున్నాయి. రాతి స్థంబాలు కూలిపోతున్నాయి. గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు తూర్పు ద్వారాన్ని ఆనుకుని ఉన్న ప్రాకారం 36 మీటర్ల వరకు కుప్పకూలింది.
దీంతో ప్రహరీ మొత్తంగా కూలిపోయే ప్రమాదం పొంచి ఉన్నది. రామప్ప ఆలయానికి 300 మీటర్ల దూరంలో ఉన్న ఉప శివాలయం పూర్తిగా కూలిపోయింది. ప్రధాన ఆలయంతోపాటు చుట్టుపకల 16 ఉపాలయాలూ పూర్తిగా శిథిలమైపోయాయి. కామేశ్వరాలయం పునర్నిర్మాణం కోసం కూలగొట్టి శిలలను కుప్పలుగా పోశారు. చుట్టుపకల ఉన్న ఆలయాలన్నీ దశాబ్దాల తరబడి ఆదరణ లేక శిథిలమయ్యాయి. వీటిలో శివాలయం పూర్తిగా కూలిపోయింది. రామప్పతోపాటు లక్ష్మీదేవిపేట, పెద్దాపురం, రామాంజాపురం, నర్సాపురం గ్రామాల్లోని ఆలయాలు సంరక్షణ లేకపోవడంతో సహజత్వాన్ని కోల్పోతున్నాయి. గుప్త నిధుల కోసం వేట కొనసాగుతూనే ఉండడంతో నిత్యం తవ్వకాలు జరిగి నిర్మాణాలు చెదిరిపోతున్నాయి.
ఇటీవలె తవ్వకాలు..
రామప్ప సమీపంలోని గొల్లగుడిలో ఇటీవల గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. గుడి పైకప్పు ధ్వంసం చేశారు. అక్కడ కాకతీయుల కాలం నాటి నిధులున్నాయనే కారణంతోనే కొందరు ఈ పని చేసినట్టు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. గొల్లగుడిలో ఏడాది క్రితం ఇదే రకమైన తవ్వకాలు జరిగాయి. రామప్ప ఆలయం సమీపంలో గడ్డపారలతో తవ్వకాలు జరిపిన ఆనవాళ్లూ ఉన్నాయి. గుప్తనిధుల కోసం దుండగులు గడ్డపారలతో గర్భగుడిని తవ్వడంతో శివలింగాలు చెల్లాచెదురయ్యాయి. ప్రపంచ వారసత్వ సంపద ఉన్న ప్రదేశంలో ఉండాల్సిన భద్రతా ఏర్పాట్లు కనీసం లేకపోవడం వల్లే ఈ పరిస్థితులు వస్తున్నాయని పురావస్తు నిపుణులు చెబుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రామప్ప పరిసరాల్లో అవసరమైన మేరకు భద్రతా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.