Rajiv Yuva Vikasam | గోల్నాక, ఏప్రిల్ 12: కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు ప్రక్రియలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పథకానికి దరఖాస్తు చేసేందుకు ఈ నెల14( సోమవారం) చివరి తేగా కాగా… గడువు లోపు దరఖాస్తు చేసుకునేందుకు లబ్ధిదారులు ఆన్ లైన్ సెంట్లర్ల వద్ద బారులు తీరుతున్నారు. అయితే గత నాలుగు రోజులుగా సర్వర్ మొరాయిస్తుండంటంతో దరఖాస్తు చేసుకోవడం లబ్ధిదారులకు కష్టసాధ్యంగా మారింది. ముఖ్యంగా దరఖాస్తు ఫారం పూర్తి చేయలేకపోతున్నారు. దరఖాస్తు ఫారం నమోదు సమయంలో వెబ్ సైట్ హ్యాంగ్ అవుతోంది. దాన్ని రీఫ్రెష్ చేస్తే మళ్లీ కొత్త ఫారం కనిపిస్తోంది. ఇది దరఖాస్తుదారులతో పాటు మీ సేవా నిర్వహకులకు కూడా చిరాకు కలిగిస్తోంది.
అధికారుల అనాలిచిత నిర్ణయం…యువకుల పాలిట శాపం
శనివారం ఈ నెల 12న( నేడు) రెండో శనివారంతో పాటు హనుమాన్ జయంతి, 13న ఆదివారం. ఈ రెండు రోజులు ప్రభుత్వ ఆఫీసులకు సెలవు. ఇక 14వ తేదీ సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ హాలిడే ప్రకటించింది. అందువల్ల సోమవారం కూడా ప్రభుత్వ ఆఫీసులు పనిచేయవు. ఇప్పటికే దరఖాస్తు గడువు పొడగించిన ప్రభుత్వం ఈనెల 14 వ తేదీ చివరి గడువు ప్రకటించినప్పటికీ మూడు రోజలు పాటు వరుస సెలవులను పరిగణనలోకి తీసుకోకుండా అధికారులు చివరి తేదీని నిర్ణయించడం, మరోవైపు గత నాలుగు రోజులుగా సంబంధిత వెబ్ సైట్ సర్వర్లు మొరాయిస్తుండటం లబ్ధిదారులకు శాపంగా మారింది. మరి ఈ సమస్యలపై మరోసారి గడువు పొడిగిస్తారా లేదా.. సర్వర్లను సరి చేసి సమస్యను పరిష్కరించి సజావుగా దరఖాస్తు ప్రక్రియ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాల్సి ఉంది.
తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం కింద చిరు వ్యాపారులకు, (ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్) వారికి 100 శాతం రాయితీతో రూ.50,000 వరకు రుణం అందిస్తోంది. అంటే, ఈ మొత్తాన్ని తీసుకున్న వారు, ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక లక్ష రూపాయలలోపు రుణం తీసుకుంటే, 90 శాతం రాయితీ ఇస్తారు. అంటే, రూ.1,00,000 రుణం తీసుకుంటే, లబ్ధిదారుడు కేవలం రూ.10,000 మాత్రమే తిరిగి చెల్లిస్తే సరిపోతుంది. రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల మధ్య రుణం తీసుకుంటే, 80 శాతం రాయితీ లభిస్తుంది. ఉదాహరణకు, రూ.2,00,000 రుణం తీసుకుంటే, రూ.40,000 చెల్లిస్తే చాలు. రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల లోపు రుణాలకు 70 శాతం రాయితీ ఉంటుంది. అంటే, రూ.4,00,000 రుణం తీసుకుంటే, రూ.1,20,000 తిరిగి చెల్లించాలి. ఈ విధంగా రుణ రాయితీలు యువతకు స్వయం ఉపాధిని సులభతరం చేస్తాయి.
రాజీవ్ యువ వికాసం పథకం కింద ఈ రుణాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సహా ఈబీసీ వర్గాల యువతకు అందుబాటులో ఉంటాయి. చిన్న దుకాణాలు, సర్వీస్ సెంటర్లు, ఇతర చిరు వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశంగా మారుతోంది. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.6 వేల కోట్లను బడ్జెట్లో కేటాయించింది. దీని ద్వారా 5 లక్షల మంది యువతకు లబ్ధి చేకూరనుంది. ఏప్రిల్ 14వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించి.. ఏప్రిల్ 15 నుంచి మే 31 మధ్యలో వాటిని పరిశీలించనున్నారు. ఎంపికైన లబ్ధిదారులకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న రుణ మంజూరు పత్రాలు ఇస్తారు. ఈ పథకం ద్వారా యువత ఆర్థికంగా స్వతంత్రులు కావడమే కాక, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.