కొణిజర్ల, మార్చి 5: ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టి రాజధాని బస్సు పల్టీ కొట్టిన ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల సమీపంలోని విజయ ఇంజినీరింగ్ కళాశాల వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సత్తుపల్లి డిపోకు చెందిన రాజధాని (ఇంద్ర) బస్సు బుధవారం హైదరాబాద్ నుంచి సత్తుపల్లి బయలుదేరింది.
తనికెళ్ల వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న తల్లాడ మండలం అన్నారుగూడేనికి చెందిన రవి, పెనుబల్లి మండలం భువ్వన్నపాలేనికి చెందిన సత్యనారాయణ, సత్యవతికి తీవ్ర గాయాలు కాగా మరో 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను 108 వాహనం ద్వారా ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఎస్సై గుగులోతు సూరజ్ ఘటనా స్థలానికి చేరుకొని బస్సును క్రేన్ సహాయంతో పక్కకు జరిపి కేసు దర్యాప్తు చేస్తున్నారు.