వేములవాడ టౌన్, నవంబర్ 21 : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రాజన్న ఆలయ దక్షిణంవైపు విస్తరణ పనులను దుకాణాలు, ఇండ్ల యజమానులు శుక్రవారం అడ్డుకున్నారు. ఆలయ దక్షిణం వైపు ఉన్న ప్రధాన రహదారిని 25 అడుగుల మేరకు విస్తరించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం పనులు ప్రారంభించేందుకు వాహనం తీసుకురాగా.. దుకాణదారులు, ఇండ్ల యజమానులు అడ్డుకున్నారు. విషయం తెలిసి ఆర్అండ్ బీడీఈ శాంతయ్య అక్కడకు చేరుకోగా తమ నిరసన తెలిపారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పనులు ఎలా చేస్తారని ఆగ్రహించారు. విస్తరణ పనులతో తమ దుకాణాలు, గృహాలు కోల్పోతున్నామని, భారీ నష్టం వాటిల్లుతుందని ఆవేదన చెందారు. అసలు రహదారిని ఎన్ని అడుగులు విస్తరిస్తారో తెలుపాలని డిమాండ్ చేశారు. వారి ఆందోళనకు బీజేపీ సిరిసిల్ల జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ మద్దతు ప్రకటించారు.