యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): మునుగోడు నియోజకవర్గంలో పోస్టర్లు కలకలం రేపాయి. రాత్రికి రాత్రే బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. అన్ని మండలాల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఈ పోస్టర్లను అంటించారు. ఫోన్ పే తరహాలో డిజైన్ చేసి గోడలకు అంటించారు. ఫోన్ పే స్థా నంలో ‘కాంట్రాక్టు పే’ రూపొందించా రు. మధ్యలో రాజగోపాల్‌రెడ్డి ఫొటో ముద్రించారు. ‘18 వేల కోట్ల కాంట్రాక్టు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కేటాయించడం జరిగింది’ అని ఫొటో కింద రాసి ఉన్నది.
ఇక ట్రాన్సాక్షన్ ఐడీలో BJP18THOUSAND CRORES అని ముద్రించారు. ఫోన్ పేలో ట్రాన్సాక్షన్ చేస్తే వచ్చే రివార్డును సైతం పెట్టారు. ‘NEW REWARD EARNED 500’ అని రాసి ఉన్నది. రూ.18 వేల కోట్లకు రాజగోపాల్‌రెడ్డి బీజేపీకి అమ్ముడుపోయారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల రాజగోపాల్ రెడ్డి కూడా ఓ టీవీ చానల్లో ఏడాది కిందటే రూ.18 వేల కోట్ల ఒప్పందం కుదిరిందని పేర్కొనడం గమనార్హం.