హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో ఈ ఏడాది భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. వానకాలంలో ఎండలు దంచికొట్టగా.. చలికాలంలో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన పరిస్థితులే ఇందుకు కారణమని వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు. కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో వర్షం కురిసింది. ఈ నెల 14,15 తేదీల్లో అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో 16,17తేదీల్లో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశమున్నట్టు పేర్కొన్నారు.
‘గోర్బోలి’ని రాజ్యాంగంలో చేర్చాలి
హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): లంబాడీల భాష ‘గోర్ బోలి’ని రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాంబల్‌నాయక్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు లంబాడీలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు విడుదల చేయాలని, గిరిజన గ్రామపంచాయతీలకు రూ.కోటి కేటాయించాలని కోరారు. గిరిజనుల అభివృద్ధి కోసం అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక చర్చ జరగాలని ఆశాభావం వ్యక్తంచేశారు. సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 15న సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. లగచర్ల ఘటనలో జైలులో మగ్గుతున్న 51 మంది గిరిజన రైతులను విడుదల చేయాలని కోరారు.