హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో నైరుతి రుతుపవనాలు మరింతగా పురోగమిస్తున్నా యి. ఇవి మూడు నాలుగు రోజుల్లో కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లోని మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా రుతుపవనాలు ముందుకు సాగుతాయని పేర్కొన్నది. ఉపరితల ద్రోణి ఆగ్నేయ అరేబియా తీరంలోని ఉత్తర కేరళ, కర్ణాటక నుంచి తమిళనాడు, కేరళ మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఏర్పడిందని తెలిపింది. రాష్ట్రంలోకి పశ్చిమ దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నాయని పేర్కొన్నది. జూన్ 3 వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. పలు జిల్లాల్లో మంగళవారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. సోమవారం అత్యధికంగా ఖమ్మం జిల్లా కొణిజర్లలో 3.20, గుబ్బగుర్తిలో 2.63 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సోమవారం రాష్ట్రంలో ఎండలు దంచి కొట్టాయి. 28 జిల్లాల్లో 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రామగుండంతో పాటు, కరీంనగర్ జిల్లా జమ్మికుంట, పెద్దపల్లి జిల్లా ఎస్ల తక్కలపల్లిలో అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు టీఎస్డీపీఎస్ తెలిపింది.