మంత్రి శ్రీనివాస్‌యాదవ్
హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ పార్ట్‌టైమ్ పొలిటీషయన్ అని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ విమర్శించారు. పంటలకు కనీస మద్దతు ధరలు ఎవరు కల్పిస్తారో కూడా ఆయనకు తెలియదని ఎద్దేవా చేశారు. శనివారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేది కేంద్రమో.. రాష్ట్రమో తెలియని అజ్ఞానంలో రాహుల్‌గాంధీ ఉన్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ర్టాన్ని కొట్లాడి సాధించుకొన్నామని, ఎవరూ ఊరికే ఇవ్వలేదని స్పష్టంచేశారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు సాగునీరు, తాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్తు, ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచటం వల్లే రాష్ట్రంలో పంటలు పుష్కలంగా పండుతున్నాయని తెలిపారు. వరంగల్‌లో శుక్రవారం కాంగ్రెస్ విడుదలచేసిన డిక్లరేషన్ వట్టి బక్వాస్ అని ధ్వజమెత్తారు. డిక్లరేషన్‌లోని హామీలను కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో అమలు చేసి చూపించాలని డిమాండ్ చేశారు. దేశమంతా ఒకేరకమైన పంట కొనుగోలు విధానం ఉండాలని టీఆర్ఎస్ పోరాటం చేస్తున్నదని, దీనిపై కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీని నడపటం చేతగాక పారిపోయిన రాహుల్‌గాంధీ, ఇక్కడికొచ్చి నీతులు చెప్తున్నారని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని స్పష్టంచేశారు.
కేసీఆర్ రాజు కాదు.. మహారాజు : మాగంటి
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాజు కాదని, తెలంగాణ ప్రజలు హృదయాల్లో చెదరని గూడుకట్టుకొన్న మహారాజు అని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. తెలంగాణ నిధులను పులివెందులకు తరలించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు.
కేటీఆర్‌కు జవాబిచ్చే సత్తా ఎవరికీ లేదు: దానం
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు జవాబిచ్చే సత్తా కాంగ్రెస్, బీజేపీల్లో ఎవరికీ లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీకి రైతుల గురించి అవగాహనేలేదని ఎద్దేవా చేశారు. కిరాయికి తెచ్చుకున్న మనుషులతో కాంగ్రెస్, బీజేపీ సభలు పెట్టుకొంటున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ ఇతర ఏ రంగాలపై అయినా సరే చర్చకు రావాలని సవాల్ విసిరారు.