Rachakonda | ఇబ్రహీంపట్నం/యాదాద్రి భువనగిరి, నవంబర్ 9: రాచకొండ భూముల జోలికొచ్చిన కాంగ్రెస్ పార్టీకి గతంలో కర్రుకాల్చి వాతపెట్టిన జనం ఈసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తమ భూముల వంకచూస్తే రణరంగమేనని హెచ్చరిస్తున్నారు. ఫైరింగ్ రేంజ్ ఏర్పాటుపై 15 ఏండ్ల కిందటే కదంతొక్కిన రాచకొండ బిడ్డలు.. మరోమారు ఉద్యమ శంఖారావాన్ని పూరిస్తామని చెప్తున్నారు. తాము అధికారంలోకి వస్తే రాచకొండ ప్రాం తంలో 50 వేల ఎకరాలను ల్యాండ్‌పూలింగ్ విధానంలో సేకరిస్తామన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై రాచకొండ భగ్గుమన్నది. తమ భూముల జోలికొస్తే సహించబోమని తేల్చిచెప్పింది.
హైదరాబాద్‌కు అతి సమీపంలో యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో విస్తరించి ఉన్న రాచకొండ ప్రాంతానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. అనేక గ్రామాల ప్రజలు ఇక్కడి భూములను నమ్ముకుని ఏండ్లుగా జీవిస్తున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని రాచకొండ, తిప్పాయిగూడ, అల్లాపుం, కడీలబావితండా, రాచకొండ తండా, ముచ్చర్లకుంటతండా, పటేల్చెర్వుతండా తదితర గ్రామాల ప్రజలు ఇక్కడి భూములపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వీరిలో అత్యధికులు గిరిజనులే. 2008లో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వేల ఎకరాలను సేకరించి ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. పాత నల్లగొండ జిల్లాలోని నారాయణపురం ప్రాంతంతో పాటు రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంచాల మండలాల్లోని రాచకొండ పరిసర ప్రాంతాల గుట్టల ప్రాంతంలో ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు కానుందని అధికారికంగా ప్రకటనలు కూడా వచ్చాయి.
ఫైరింగ్ రేంజ్ ప్రకటన వెలువడిన వెంటనే రాచకొండ ప్రాంతం ఒక్కసారిగా అట్టుడికిపోయింది. ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ నల్లగొండ జిల్లాలోని నారాయణపురం, అల్లాపురం, అల్లాపురంతండా, తుంబాయితండా, ఐదుదోనలతండా, రాచకొండతండా, రంగారెడ్డి జిల్లాలోని తిప్పాయిగూడ, పటేల్చెర్వుతండా, కడీలబావితంగా, ఆరుట్ల తదితర గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఫైరింగ్ రేంజ్ కోసం సర్వే చేసేందుకు కేంద్రం నుంచి అధికారులు కూడా రంగంలోకి దిగారు. సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని ఐదుదోనల తండా వద్ద సర్వే కోసం వచ్చిన అధికారులపై ఈ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. అధికారులపై పెట్రోలు పోసి, కర్రలు, రాళ్లతో దాడులకు దిగారు. భయభ్రాంతులకు గురైన అధికారులు సర్వే మొదలుపెట్టకుండానే వెనుదిరిగి పోయారు. ఆ తర్వాత కూడా రాచకొండవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ప్రజా ఉద్యమంతో వెనక్కి తగ్గిన కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చివరకు ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకుంది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ల్యాండ్ పూలింగ్ ద్వారా రాచకొండలో 50వేల ఎకరాలు సేకరించి విదేశీ కంపెనీలకు ఇస్తామన్న రేవంత్ వ్యాఖ్యలపై రాచకొండ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ భూముల జోలికొస్తే గత ఉద్యమ స్ఫూర్తితో కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతామని, రణరంగం తప్పదని హెచ్చరిస్తున్నారు.
ఎన్నికలకు ముందే రేవంత్‌రెడ్డి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టేశారు. అధికారం చిక్కితే పచ్చని రాచకొండను కబ్జా చేస్తానని ముందే ప్రకటించారు. కొండలు, గుట్టలు, లోయలు, గుహలు, గోపురాలతో అలరారే రాచకొండ వైభవాన్ని పిప్పి చేస్తానని బాహాటంగానే చెప్పారు. రైతుల భూములు అడ్డికి పావుశేరు లెక్క గుంజుకుంటానని మనసులోని మాటను బయటపెట్టేశారు. ఉమ్మడి నల్లగొండతోపాటు రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో సుమారు 32 వేల ఎకరాల్లో రాచకొండ విస్తరించి ఉంది. ఉమ్మడి నల్లగొండలో 14,765 ఎకరాల్లో ఉండగా, ఎక్కువ భాగం రాచకొండ గ్రామ రెవెన్యూ పరిధిలోనే ఉంది. వీటిలో 2,217 ఎకరాల పట్టా భూములు, 2,956 ఎకరాల ప్రభుత్వ భూమి, 8,945 ఎకరాల అటవీభూమి ఉంది. మిగతాది రంగారెడ్డిలో విస్తరించి ఉంది.
ఇప్పుడీ భూములపై కన్నేసిన రేవంత్ అధికారంలోకి వస్తే ఆ భూములను లాక్కుంటామని ప్రకటించి రాచకొండ వాసులను భయభ్రాంతులకు గురిచేశారు. స్వరాష్ట్ర సాధనకు ముందు పడావు పడిన భూములతో అగమ్యగోచరంగా ఉన్న రాచకొండ రైతుల జీవితాలు ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాయి. సాగునీరు అందడం, రైతుబంధు పెట్టుబడి సాయంతో సాగుచేసుకుని బతుకుతున్నారు. శివన్నగూడెం రిజర్వాయర్ పూర్తయితే మంచిరోజులు తమవేనని భావిస్తున్న వేళ రేవంత్ వ్యాఖ్యలు స్థానికులను ఆందోళనలోకి నెట్టేశాయి. రాచకొండ మొత్తం 32 వేల ఎకరాలైతే 50 వేల ఎకరాలు ఎక్కడి నుంచి సేకరిస్తారని ప్రశ్నిస్తున్నారు. రేవంత్ వ్యాఖ్యలను బట్టి చూస్తే నారాయణపురం, చౌటుప్పల్, గట్టుప్పల్, మర్రిగూడ, మాల్, మంచాల తదితర మండలాల్లోని పలు గ్రామాలు కూడా బలయ్యే అవకాశం ఉంది. రేవంత్‌రెడ్డి అనుచరులు, బినామీలు రాచకొండ పరిధిలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్టు తెలుస్తున్నది. రేవంత్‌రెడ్డికి దండుమైలారం సమీపంలో 50 ఎకారల భూమి ఉందని, అక్కడ ఎకరం సుమారు కోటి నుంచి కోటిన్నర పలుకుతున్నదని చెప్తున్నారు.
రాచకొండ పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్నది. ఇటీవల పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగింది. హైదరాబాద్‌కు దగ్గరగా ఉండడంతో టూరిజం కారిడార్‌గా మారుతున్నది. రాచకొండ కోటను సందర్శించే పర్యాటకుల సంఖ్య పెరుగుతున్నది.ఇక్కడ సుమారు వందకుపైగా ఆలయాలున్నాయి. నారాయణపురం మండల పరిధిలోని సరళ మైసమ్మ ఆలయానికి నిత్యం భక్తులు పోటెత్తుతుంటారు. సినిమా షూటింగ్‌లు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. పర్యాటక అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.80 లక్షలు విడుదల చేసింది. రేవంత్ కుట్రలు అమలైతే పర్యాటకంతోపాటు పర్యావరణం కూడా దెబ్బతినే అవకాశం ఉన్నది.
ఎవరో ఒకాయన మా భూములను తీసుకుంటామన్నాడని తెలిసింది. మా భూముల దగ్గరకు ఎవరొచ్చినా ఊరుకోం. లేచినప్పటి నుంచి రాత్రి వరకు భూముల వద్దే కష్టం చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నం. మాకున్న భూమిని దున్నుకుని బతకడమే కాకుండా మా పిల్లలను మంచిగ చదివించుకుంటున్నాం. మా భూముల జోలికి ఎవరొచ్చినా సహించం.
– జర్పుల బిచ్యా, కడీలబావి తండా
మా భూమిలో సాటెడు జొన్నలు పండినా చాలు. రేవంత్‌రెడ్డి ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఎవరూ చూస్తూ ఊరుకోరు. మేము కేసీఆర్ ఇస్తున్న రైతుబంధుతో మా పొలంలో పంటలు సాగుచేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నాం. అలాంటి భూముల జోలికి ఎవరైనా వస్తే ఉరికించి కొడతాం.
– మెగావత్ శ్రీనివాస్, పటేల్‌చెర్వు తండా
గతంలో పొలంలో సాగు చేసుకోవడానికి పెట్టుబడులు లేక కట్టెలు కొట్టేందుకు ఇతర జిల్లాలకు కూలీలుగా వెళ్లేవాళ్లం. తెలంగాణ వచ్చినంక కేసీఆర్సారు ఇస్తున్న రైతుబంధుతో పంటలు సాగు చేసుకుని ఇక్కడే బతుకుతున్నం. అలాంటి బంగారు భూములను ఎవడో వచ్చి గుంజుకుంటామని, కంపెనీలకు ఇస్తామని చెపితే కడుపు మండిపోతుంది.
– మేగావంత్ శంకర్ నాయక్, పటేల్చెర్వుతండా
మాకున్నదే భూముల ఆధారం. ఆ భూములు అమ్మేసి మేమెలా బతకాలి. ఎవరొచ్చినా భూములు మాత్రం ఇవ్వం. భూమికోసం ఎన్నో ఏండ్లుగా కొట్లాడి సాధించుకున్నం. బంగారంలా చూసుకుంటుంటే భూములకోసం కాంగ్రెస్ పెద్దాయన వచ్చి తీసుకుంటామంటే మేమెలా ఇస్తం. మా భూములు ఎవరికీ ఇవ్వం. మా భూములు మాకే ఉండాలి.
– భజన్నాయక్, రాచకొండ తండా