Manchu Family Dispute | హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): సినీనటుడు మోహన్‌బాబు కుటుంబంలో వివాదం బుధవారం ఓ కొలిక్కి వచ్చింది. జల్పల్లిలోని మోహన్‌బాబు ఇంటి వద్ద రెండు రోజులుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు పోలీసుల జోక్యంతో తాత్కాలికంగా సద్దుమణిగాయి. మోహన్‌బాబు కుమారులు విష్ణు, మనోజ్‌ను రాచకొండ సీపీ సుధీర్‌బాబు వార్నింగ్ ఇచ్చారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టంచేశారు. మనోజ్‌ను బైండోవర్ చేయగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించనని మనోజ్ లక్ష రూపాయల బాండ్‌ను అందజేశాడు. మోహన్‌బాబును కూడా విచారణకు రావాలని పోలీసులు నోటీసులు పంపారు. కానీ అనారోగ్యంతో దవాఖానలో చికిత్స తీసుకుంటున్నానని మోహన్‌బాబు పోలీసులకు తెలిపారు. పోలీసుల నోటీసులపై స్టే విధించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల ఎదుట మోహన్‌బాబు హాజరుపై మినహాయింపును ఇచ్చిన కోర్టు విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. కుటుంబ వివాదంలో పోలీసులు, మీడియా అతిగా జోక్యం చేసుకోవద్దని సూచించింది.
మోహన్‌బాబుపై కేసు, మేనేజర్ అరెస్ట్
జల్పల్లిలోని నివాసం వద్ద ఓ మీడియా ప్రతినిధిపై మోహన్‌బాబు దాడి చేయడంపై పహాడీషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా టీయూడబ్ల్యూజే, పలు జర్నలిస్ట్ సంఘాలు ఆందోళనకు దిగాయి. టీయూడబ్ల్యూజే రాష్ట్ర కోశాధికారి మోతె వెంకట్‌రెడ్డి, మేడ్చల్ జిల్లా, కాప్రా ప్రెస్‌క్లబ్ జర్నలిస్టులు రాచకొండ సీపీ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. మోహన్‌బాబును అరెస్ట్ చేయాలని సీపీని కోరారు. మనోజ్‌పై దాడి కేసులో మోహన్‌బాబు మేనేజర్ కిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడిగా ఉన్న వినయ్‌రెడ్డి కోసం గాలిస్తున్నారు.
నాన్న చాలా మంచివాడు!
మీడియాపై దాడికి మా నాన్న తరఫున క్షమాపణలు. నాన్న చాలా మంచివాడు. కొందరి మాటలు విని మా నాన్న నన్ను శత్రువుగా చూస్తున్నారు. నేను ఆస్తి కోసం గొడవ పడటం లేదు. మోహన్‌బాబు యూనివర్సిటీలో అన్యాయానికి గురైన విద్యార్థుల తరఫున మాట్లాడినందుకు గొడవ మొదలైంది. నా 7 నెలల కూతురు, నా భార్యను గొడవలోకి లాగుతున్నారు. పోలీసులు నిష్పాక్షపాతంగా కేసు దర్యాప్తు చేయాలి. మంచు మనోజ్
అదే నాన్న చేసిన తప్పు
ప్రతీ ఇంట్లోనూ సమస్యలు ఉంటాయి. సమస్యలు పరిష్కారమవ్వాలని పెద్దలు కోరుకుంటారు. మమ్మల్ని విపరీతంగా ప్రేమించడమే మా నాన్న చేసిన తప్పు. మా నాన్న ఓ మీడియా ప్రతినిధిపై ఉద్దేశపూర్వకంగా దాడి చేయలేదు. అది అనుకోకుండా జరిగింది. మంచు విష్ణు