హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ) : ఏపీ బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు మోహన్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు అధ్యక్షురాలిగా ఉన్న రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి నుంచి మాధవ్ బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం మరోసారి విభజన గాయాలకు గురికాకుండా ఈ ప్రాంత సంస్కృతీ, సంప్రదాయాలు, భాష, వారసత్వంపై ప్రజలకు నాది అనే భావన పెరిగేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. పునర్విభజన చట్టంలో ఇంకా మిగిలిన సమస్యల పరిష్కారానికి తనవంతు కృషిచేస్తానని ఆయన పేర్కొన్నారు.