హైదరాబాద్, డిసెంబర్ 23(నమస్తే తెలంగాణ)/ బేగంపేట: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు కేంద్రాన్ని కోరారు. గురువారం పీవీ 17వ వర్ధంతిని పురస్కరించుకొని రాష్ట్ర గవర్నర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఘనంగా నివాళి అర్పించారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై ఢిల్లీలో మకాం వేసిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలు తెలంగాణభవన్‌లో పీవీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నివాళి అర్పించారు. అనంతరం కేశవరావు మాట్లాడుతూ.. పీవీ అంటేనే ఆర్థిక సంసరణలు, విద్యారంగ సంసరణలకు పర్యాయపదమని అన్నారు. పీవీ సేవలను దేశం గుర్తుంచుకోవాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పీవీ విగ్రహాలను ఆవిష్కరిస్తున్నట్టు వివరించారు. పీవీకి భారతరత్న అవార్డు ప్రకటించి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరినట్టు గుర్తుచేశారు. దేశ రాజధాని ఢిల్లీలో పీవీకి నివాళులు అర్పించడం తమకు దక్కిన భాగ్యంగా భావిస్తున్నామని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. రాజకీయాల్లో తనలాంటి వారికి ఆయన స్ఫూర్తి ప్రదాత అని తెలిపారు. తన తండ్రి పీవీ శిష్యరికంలోనే పనిచేశారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కార్యక్రమంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎంపీలు రంజిత్‌రెడ్డి, వెంకటేశ్ నేతకాని, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, సురేశ్‌రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ ముదిరాజ్ పాల్గొన్నారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జాతి గర్వించదగిన వ్యక్తి అని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ అన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞానభూమిలో గురువారం పీవీ 17వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. గవర్నర్‌తో పాటు మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్‌అలీ, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ వాణీదేవి, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, సభ్యుడు నరేందర్ తదితరులు పీవీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. బహుభాషా కోవిదుడు, దేశంలో ఆర్థిక సంస్కరణలను చేపట్టిన మహనీయుడు పీవీ అని కొనియాడారు. మంత్రి తలసాని మాట్లాడుతూ.. ప్రధానిగా, మంత్రిగా సుదీర్ఘకాలం దేశానికి సేవలు అందించినప్పటికీ ఢిల్లీలో కనీసం పీవీ ఘాట్ లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆర్థికరంగంలో ప్రమాదపు అంచున ఉన్న దేశాన్ని తన ఆలోచనలతో గట్టెక్కించిన పీవీ.. జాతిరత్నంగా కీర్తనలు అందుకోవడం తమకు గర్వకారణమని ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి పేర్కొన్నారు. కార్యక్రమంలో పీవీ కుటుంబసభ్యులు పీవీ రంగారావు, మారంరాజు శేఖర్, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పీవీ ఘాట్‌లో కీర్తనలు, భజనలు నిర్వహించారు. అసెంబ్లీ ఆవరణలో నిర్వహించిన పీవీ వర్ధంతి కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ ప్రొటెం వెన్నవరం భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, ఎమ్మెస్ ప్రభాకర్, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, శాసనసభ కార్యదర్శి డాక్టర్ వీ నర్సింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
చేర్యాలకు చెందిన కవి, ఉపాధ్యాయుడు గుళ్లపల్లి తిరుమల కాంతికృష్ణ తాను చదువుకొన్న సర్వేల్ గురుకుల విద్యాలయంపై గీతాన్ని రాశారు. గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని రాసిన ఈ గీతాన్ని గురువారం హైదరాబాద్‌లోని తన స్వగృహంలో పాఠశాల పూర్వ ప్రధానాచార్యుడు వీవీఎస్ఎన్ రావు ఆవిష్కరించారు. ఈ పాఠశాల స్థాపనకు మూలమైన పీవీ వర్ధంతి సందర్భంగా ఈ గీతాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్వేల్ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ నరేందర్‌రెడ్డి, స్వర్ణోత్సవ కమిటీ సభ్యులు శాంతానందప్రసాద్, చెన్నరాజా, డిండినాథ్ పాల్గొన్నారు.