హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): గోల్డెన్ జూబ్లీ జరుపుకొంటున్న జేఎన్టీయూ హైదరాబాద్‌లో 2019-20, 2020-21 విద్యాసంవత్సరాలకు కలిపి ఒకేసారి నిర్వహిస్తున్న 10వ స్నాతకోత్సవ వేడుకలకు విద్యార్థుల నుంచి భారీ స్పందన వచ్చింది. కొవిడ్ నేపథ్యంలో రెండేండ్ల నుంచి స్నాతకోత్సవాన్ని నిర్వహించలేకపోయారు. రెండేండ్లకు కలిపి నిర్వహించిన ఈ స్నాతకోత్సవంలో మొత్తం 1,19,106 మందికి పట్టాలు అందజేశారు. వీరిలో అండర్ గ్రాడ్యుయేషన్‌లో 1,04,875, పోస్టు గ్రాడ్యుయేషన్‌లో 12,798 మంది, డాక్టర్ ఇన్ ఫార్మసీలో 778 మంది, పీహెచ్‌డీలో 271 మంది పట్టాలు పొందగా.. 95 మంది విద్యార్థులకు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ గోల్డ్‌మెడల్స్ అందజేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పీహెచ్డీ విద్యార్థులకు జేఎన్టీయూ వీసీ కట్టా నరసింహారెడ్డి పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా వీసీ నరసింహారెడ్డి మాట్లాడుతూ.. గోల్డెన్ జూబ్లీ సందర్భంగా వర్సిటీ అభివృద్ధికి అన్నివిధాలుగా కృషి చేస్తున్నామని చెప్పా రు. విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా 8 రకాల నూతన కోర్సులు (ఎమర్జింగ్ కోర్సులు) అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. మెగా జాబ్‌మేళాలను నిర్వహించి దాదాపు 17 వేల మందికి ఉద్యోగాలు కల్పించినట్టు వివరించారు. నాణ్యమైన విద్యావిధానం, పరిశోధనలు, డిగ్రీల కోసం అంతర్జాతీయ వర్సిటీలతో ఒప్పందాలు చేసుకోవడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వర్సిటీ క్యాంపస్‌లోనే జే-హబ్ వంటి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. కార్యక్రమంలో డిపార్టుమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రటరీ శ్రీవారి చంద్రశేఖర్‌ను జేఎన్టీయూ గౌరవ డాక్టరేట్‌తో సన్మానించారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ గోవర్ధన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్‌హుస్సేన్, వర్సిటీ వివిధ విభాగాల డైరెక్టర్లు, కాలేజీ ప్రిన్సిపాళ్లు, ప్రొఫెసర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఈసీ సభ్యులు పాల్గొన్నారు.