Mahadevpur | జయశంకర్ భూపాలపల్లి/మహదేవపూర్, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : తమ భూమికి పరిహారం ఇచ్చిన తర్వాతే పనులు చేయాలని ఆందోళన చేస్తున్న మహిళా రైతుపై పోలీసులు ప్రతాపం చూపించారు. ఆమెను తీవ్రంగా కొట్టి ఆత్మహత్యకు ప్రయత్నించిందని చెప్పి తీసుకెళ్లి దవాఖానలో పడేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని ఎల్కేశ్వరం గ్రామంలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు మెయిన్ కెనాల్ పనులను తమ భూములకు పరిహారం ఇచ్చిన తర్వాతే కొనసాగించాలని చేస్తున్న ఆందోళన రెండు రోజులకు చేరింది. మంగళవారం నుంచి ఆందోళన చేస్తున్న మహిళా రైతు కమలను ఆత్మహత్యకు ప్రయత్నించిదంటూ దవాఖానకు తరలించి పోలీసులు బుధవారం హైడ్రామా ఆడారు. ఆమెను దవాఖానకు తరలిస్తుండగా పనులు చేస్తున్న వాహనాలకు అడ్డంపడ్డ రైతులపైనా తమ ప్రతాపం చూపారు. కాగా కమలను పోలీసులు విపరీతంగా కొట్టి అక్కడి నుంచి ఆత్మహత్యాయత్నం పేరిట దవాఖానకు తరలించారని, పరిస్థితిని తమ అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు కొత్త డ్రామా ఆడారని ఆమె కొడుకు రవీందర్ చెప్తున్నాడు.
పోలీసులను మోహరించి పనులు
సుమారు 20 మంది రైతులు దాదాపు 10 ఎకరాల భూములను 20 ఏండ్లుగా సాగు చేసుకుంటున్నారని, అధికారులు ఇప్పుడు అది ప్రభుత్వ భూమి అని పేర్కొంటున్నారని, ఎలాంటి పరిహారం ఇవ్వకుండా.. కనీసం నోటీసులివ్వకుండా.. సర్వే కూడా చేయకుండా లాక్కుంటున్నారని ఎల్కేశ్వరం రైతులు ఆరోపిస్తున్నారు. తమ భూమి పోతుందన్న బాధతో మొదటిరోజు (మంగళవారం) రాళ్లబండి రజిత ఆత్మహత్యాయత్నం చేయగా రెండో రోజు (బుధవారం) మరో మహిళ రాళ్లబండి కమల పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిందని పోలీసులు ఆమెను మహదేవపూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. దీంతో అక్కడే ఉన్న రైతులు పనులు చేస్తున్న వాహనాలకు అడ్డుగా పడుకుని ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని బలవంతంగా తరలించి పరిస్థితిని వారి అదుపులోకి తీసుకుని కాలువ పనులను ప్రారంభించారు.
నేను పురుగుల మందు తాగలే
మా భూముల్లో అధికారులు, పోలీసులు కాలువ పనులు చేస్తుండ్రు. మా భూముల్లోం చి పనులు చేయద్దని, అందరిలెక్క మాకూ పైసలిచ్చి పనులు చేసుకోండ్రని ఎప్పటి నుం చో మొత్తుకుంటున్నా ఎవరూ వింటలేరు. ని న్న ఇట్లనే గొడవైంది. ఇయ్యాల కూడా మా భూములకు పైసలి చ్చి తీసుకోండని బతిలాడినం. వాళ్లు వినకపోతే అక్కడే కు ర్చున్నం. పోలీసులు ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రు. నేను పురుగుల మందు తాగిన అని సెప్పి నన్ను బాగా కొట్టుకుంట తీసుకొచ్చి దవాఖానల ఏసిండ్రు. నేను ఏ పురగుల మందూ తాగలే. పోలీసులు కావాలని ఇదంతా చేసిన్రు.
– రాళ్లబండి కమల, రైతు
మా అమ్మను దారుణంగా కొట్టిండ్రు
20 మంది పోలీసులు, 10 మంది ఎస్ఐలు, సీఐలు వచ్చిండ్రు. మా అమ్మ ను దారుణంగా కొట్టిండ్రు. అందరి వద్ద నుంచి సెల్ఫోన్లు లాక్కున్నరు. సెల్ఫోన్లలో వీడియోలు, ఫొటోలు తీయనివ్వలేదు. పొద్దున్నే మా భూముల వద్దకు వచ్చిండ్రు. మూడు జేసీబీలతో కెనాల్ పనులు మొదలుపెట్టిండ్రు. మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రు. బలవంతంగ భూములు గుం జుకోవడం ఏంది? ఆడ, మగ తేడా లేకుండా దారుణంగా కొట్టి పనులు చేస్తారా? మాకు ఏదైనా జరిగితే ప్రభుత్వం, పోలీసులదే బాధ్యత. – రవీందర్, కమల కొడుకు