హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైంది. ప్రభుత్వం కల్పించిన అడ్డంకులను అధిగమించి వేలాదిగా ఉద్యోగులు విజయవాడకు తరలివచ్చారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొండిపట్టు వీడి కొత్త పీఆర్సీ జీవోలను రద్దు చేసి తమ సమస్యలను పరిష్కరించాలని పీఆర్సీ సాధన సమితి నేతలు డిమాండ్ చేశారు. ఈ నెల 5 నుంచి సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు ఎన్జీవోహోం నుంచి అలంకార్ థియేటర్ మీదుగా బీఆర్టీఎస్ కూడలి వరకు భారీ నిరసన ప్రదర్శన జరిపారు. విజయవాడ వీధులన్నీ ఉద్యోగులతో కిక్కిరిశాయి. దీంతో అనేకచోట్ల పోలీసులు ట్రాఫిక్‌ను దారి మళ్లించాల్సి వచ్చింది. ఈ సందర్భంగా పీఆర్సీ సాధన సమితి నేతలు మాట్లాడు తూ… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన కొత్త పీఆర్సీ జీవోలను రద్దు చేసేవరకు తమ ఆందోళనను విరమించేది లేదని తేల్చిచెప్పారు. తమ సత్తా ఏమిటో చలో విజయవాడతో ప్రభుత్వానికి చాటామని పేర్కొన్నారు. ప్రభుత్వ కుట్రలు, పోలీసుల నిర్బంధాలను ఛేదించి చలో విజయవాడ సక్సెస్ చేశామని చెప్పారు. తాము చేపట్టే సమ్మె వల్ల ప్రజలకు ఏమాత్రం అసౌకర్యం కలిగినా రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని తేల్చిచెప్పారు. కొత్త పీఆర్సీ అమలుతో జీతాలు పెరిగాయనే మోసపూరితమైన మాటలను ప్రభుత్వం మానుకోవాలని అన్నారు. చర్చలతో డిమాండ్ల సాధనకు తాము ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి జోక్యం చేసుకుని ఆ దిశగా అడుగులు వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాధినేతగా సీఎం తమను చర్చలకు పిలవాలని స్పష్టం చేశారు. శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నామని, సీఎం జగన్ నేరుగా తమతో చర్చించి న్యాయం చేయాలని చెప్పారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం మొండివైఖరి వీడి, ఉద్యోగ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం నేతలు సూచించారు. కాగా ఉద్యోగులు సమస్యను జటిలం చేయొద్దని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని మంత్రులు, సీఎస్ ప్రకటించారు.