హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): నిషేధిత మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి మద్వి హిడ్మాది బూటకపు ఎన్కౌంటర్ అని ఆ పార్టీ కేంద్ర కమిటీ ఆరోపించింది. హిడ్మాను ఆయన భార్య రాజేతోపాటు కొంతమందిని విజయవాడలో నవంబర్ 15న నిరాయుధులుగా పట్టుకుని క్రూరంగా హత్య చేసి మారెడుమిల్లి ఎన్కౌంటర్ కట్టుకథను అల్లారని తెలిపింది. ఈ మేరకు మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ శుక్రవారం ఓ లేఖను విడుదల చేశారు. హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన మరుసటి రోజే ఏఓబీ రాష్ట్రకమిటీ సభ్యుడు శంకర్‌ను మరికొంతమందిని పట్టుకుని హత్య చేసి రంపచోడవరం ఏరియాలో ఎన్కౌంటర్ జరిగినట్టు పోలీసులు కట్టుకథ అల్లారని ఆరోపించారు. ఈ క్రూర హత్యకాండకు వ్యతిరేకంగా ఆదివారం దేశవ్యాప్త నిరసన దినంగా పాటించాలని ఆ లేఖలో పిలుపునిచ్చారు.
చికిత్స నిమిత్తం విజయవాడకు..
హిడ్మా, రాజే కొద్దిమంది వ్యక్తులతో కలిసి చికిత్స నిమిత్తం విజయవాడకు వెళ్లారని అభయ్ లేఖలో పేర్కొన్నారు. చికిత్స పొందుతున్న క్రమంలో కొందరు చేసిన ద్రోహం వలన పోలీసులకు సమాచారం చేరిందని తెలిపారు. కేంద్ర హోం మినిస్ట్రీ డైరెక్షన్లో ఆంధ్ర ఎస్ఐబీ వారిని అదుపులోకి తీసుకుని లొంగదీసుకోవడానికి ప్రయత్నించి విఫలమైందని తెలిపారు. ఆ తర్వాతనే క్రూరంగా హత్య చేశారని పేర్కొన్నారు. ఈ బూటకపు ఎన్కౌంటర్లో ప్రాణాలర్పించిన శంకర్, రాజేకు శ్రద్ధాంజలి అర్పిస్తున్నదని తెలిపారు. చైతు, కమూ, మల్లాల్, దేవేకు జోహార్లు అర్పించారు. వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్ల తరుణంలో లేఖ రావడం చర్చనీయాంశమైంది.
దేశసందను కార్పొరేట్లకు అప్పజెప్పేందుకే..
దేశంలో ఆర్ఎస్ఎస్-బీజేపీ మనువాదులు పచ్చి దమనకాండను కొనసాగిస్తున్నారని అభయ్ విమర్శించారు. నిత్యం హత్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ, ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను, ప్రకృతి వనరులను అభివృద్ధి పేరుతో కార్పొరేట్లకు అప్పజెప్పుతున్నదని మండిపడ్డారు. ఎన్నికల సంఘం మోదీకి గోదీ కమిషన్‌గా మారిపోయిందని, అధికారులను గుప్పిట్లో పెట్టుకొని బీహార్ ఎన్నికల్లో భారీ మోసాలు చేసి విజయం సాధించారని ఆరోపించారు. ప్రతిపాక్ష పార్టీలను మొత్తంగా నిర్మూలించి, పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థను ధ్వంసం చేసే పథకాన్ని అమలు చేస్తున్నదని నిప్పులు చెరిగారు. మావోయిస్ట్ నాయకుడు హిడ్మా వంటి సాహసోపేతమైన యుద్ధ సేనానుల ప్రేరణతో.. ఆరెస్సెస్- బీజేపీ మనువాదులకు వ్యవతిరేకంగా సాగే పోరాటంలో కార్మికులు, రైతులు, యువత, విద్యార్థులు, సామాజికవర్గాలు కలిసి రావాలని కోరారు. మారేడుమిల్లి, రంపచోడవరం హత్యకాండకు వ్యతిరేకంగా ఈ నెల 23న దేశవ్యాప్తంగా నిరసన దినంగా పాటించాలని పిలుపునిచ్చారు.