హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ అటకెక్కింది. దాదాపు 6 నెలలుగా ఊరింపులతోనే సర్కార్ సరిపెడుతుండడంతో ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నది. ప్రమోషన్ల ప్రక్రియ సాకుతో బదిలీలను సైతం సొసైటీ ఉన్నతాధికారులు అటకెక్కించారు. వెరసి ఎస్సీ గురుకుల సొసైటీలో పాలన పూర్తిగా గాడితప్పింది. మరోవైపు లక్షల రూపాయలు దారిమళ్లితున్నాయి. సొసైటీలో నెలకొన్న పరిస్థితిపై గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.
రెగ్యులర్ ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టకుండా, ఇన్చార్జుల వ్యవస్థను కొనసాగించడంపై భగ్గమంటున్నాయి. సొసైటీ చరిత్రలోనే ఎప్పుడూ లేనివిధంగా కార్యదర్శిగా రెగ్యులర్ ఐఏఎస్ కాదుకదా, కనీసం గ్రూప్ 1 ఆఫీసర్‌ను కూడా నియమించకుండా, కేవలం ఓ టీచర్‌కు ఇన్చార్జి బాధ్యతలను ప్రభుత్వం అప్పగించిందంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే సొసైటీకి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ విభాగంలోనే కీలక పోస్టులు భారీగా ఖాళీగా ఉన్నాయి.
అడిషనల్ సెక్రటరీ 1, జాయింట్ సెక్రటరీ 1, డిప్యూటీ సెక్రటరీ 3, ఫైనాన్స్ సెక్రటరీ 1, దాదాపు 150 ప్రిన్సిపల్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాల్సి ఉన్నా సొసైటీ ఉన్నతాధికారులు సీనియార్టీతో సంబంధం లేకుండా, సొసైటీ సిబ్బందితోనే, అదీ డిప్యుటేషన్‌పై ప్రధాన కార్యాలయంలో ఏండ్లుగా అక్రమమార్గంలో తిష్ట వేసినవారితోనే భర్తీ చేయడం గమనార్హం. సొసైటీలో అత్యంత కీలకమైన అకడమిక్స్‌కు సంబంధించిన పోస్టులు సైతం అందులో ఉన్నాయి. విద్యాసంబంధిత బాధ్యతలన్నీ అకడమిక్ ఇన్చార్జులే నిర్వహించాల్సి ఉంటుంది. అందుకోసం ప్రధాన కార్యాలయంలో అకడమిక్‌కు సంబంధించి ప్రత్యేకంగా జేఎస్(జాయింట్ సెక్రటరీ), డీఎస్‌లు (డిప్యూటీ సెక్రటరీ)లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ పోస్టులను సైతం అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్‌తోనే కొనసాగిస్తుండడం గురుకులాల్లో పరిస్థితికి అద్దం పడుతున్నది.
భారీగా నిధుల గోల్మాల్
ఇష్టారీతిన ఇన్చార్జుల పాలన కొనసాగుతుండటంతో పాలన గాడి తప్పడమేగాక, కో ట్లాది రూపాయాల నిధులు సైతం పక్కదారి ప డుతున్నాయని ఉద్యోగ, ఉపాధ్యాయ సం ఘాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల జఫర్‌గఢ్‌లో ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగి దాదాపు రూ. 42 లక్షల వరకు నిధులను పక్కదారి పట్టించాడు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులే కాదు, కేంద్రం మంజూరు చేస్తున్న నిధులు సైతం పక్కదారి పడుతున్నాయి. నూతన విద్యావిధానం 2020 అమల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ (పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రంలో 800 పైగా విద్యాసంస్థలు ఉండగా, అందులో గురుకులాలు సైతం ఉన్నాయి.
ఎంపికైన స్కూళ్లకు ఏడాదికి దాదాపు రూ. 10 లక్షలకుపైగా నిధులను కేంద్రం మంజూరు చేస్తున్నది. గురుకులాల్లో ఆ నిధుల వినియోగంపై ఆడిట్ కొరవడింది. సొసైటీ యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులపైనే ఆడిట్ చేయిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులపై చేయించడం లేదు. ఇదే అదునుగా ఆయా గురుకుల సొసైటీల ప్రిన్సిపల్స్ అక్రమాలకు తెరలేపారని తెలుస్తున్నది. గతంలో ఉమ్మడి నల్లగొండకు చెందిన ఓ ఎస్సీ గురుకులంలో అనేక అక్రమాలు వెలుగుచూశాయి. ప్రస్తుతం బోగస్ బిల్లులతో లక్షలు జేబుల్లో నింపుకొన్నట్టు తేలింది. అనేకచోట్ల ఇన్చార్జ్ ప్రిన్సిపల్స్, కిరా ణ, మాంసం తదితరాలు సప్లయ్ చేసే గుత్తేదారులతో కుమ్మక్కయ్యారని, విద్యార్థులకు మె నూ ప్రకారం డైట్ కూడా అందించడం లేదని విమర్శలున్నాయి. ఇన్చార్జుల పా లన వల్లే ఇంతటి దుస్థితి నెలకొన్నదని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు వెల్లడిస్తున్నాయి. ఇకనైనా ప్రమోషన్ల ను తక్షణమే చేపట్టి, పరిపాలనా వ్యవస్థను గాడిన పెట్టాలని కోరుతున్నారు.