హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించిన అంశం విచారణలో ఉండగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రమోషన్ల ప్రక్రియను కొనసాగించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)తో సంబంధం లేకుండా పదోన్నతులను కల్పించాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను డివిజన్ బెంచ్ రద్దుచేసి, ఈ వివాదాన్ని మళ్లీ సింగిల్ జడ్జికి పంపామన్న విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతుల ప్రక్రియను కొనసాగించడం కోర్టు ధికార చర్యే అవుతుందని వ్యాఖ్యానించింది. ఇప్పటివరకు చేపట్టిన పదోన్నతులను వెంటనే ఉపసంహరించుకునేలా ప్రభుత్వానికి సూచనలు చేయాలని జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ ధర్మాసనం ప్రభుత్వ న్యాయవాదికి స్పష్టం చేసింది. గత ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన మంగళవారం స్వయంగా ఈ విచారణకు హాజరయ్యారు. ఎన్సీటీఈ నిబందనల ప్రకారమే పదోన్నతుల ప్రక్రియ మొదలు పెట్టామని, టెట్‌లో అర్హత సాధించనివారిని పరిగణనలోకి తీసుకున్నామని ఆమె చెప్పారు. దీనిపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఉపాధ్యాయ పదోన్నతులకు సంబంధించి ఈ నెల 14న ఇచ్చిన ఉత్తర్వులే అమల్లో ఉంటాయని, తాజాగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని ప్రభుత్వ న్యాయవాదికి తేల్చిచెప్తూ.. అప్పీళ్లపై విచారణను మూసివేసింది.