హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ హయాంలో పారిశ్రామికంగా ఎంతో వేగంగా ఎదిగిన తెలంగాణ గత రెండేండ్ల నుంచి తీవ్ర మందగమనంలో కొనసాగుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలోని పరిశ్రమల్లో స్తబ్ధత నెలకొనడమే కాకుండా ఉత్పత్తులు గణనీయంగా పడిపోయాయి. పారిశ్రామిక సంఘాలు, తయారీదారులు, కార్మిక సంఘాలు సహా రాష్ట్రంలోని ఏ వర్గాన్ని కదిలిచ్చినా పెట్టుబడులు భారీగా తగ్గిపోవడం, ఉత్పత్తులు క్షీణించిపోవడం, ఉద్యోగాల కోత, నిలిచిపోయిన విస్తరణ ప్రణాళికల గురించే చెప్తున్నారు. రేవంత్‌రెడ్డి సర్కారు అస్పష్ట విధానాలు, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఫార్మా, టెక్స్టైల్, ఇంజినీరింగ్ గూడ్స్, ప్లాస్టిక్ తదితర పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇప్పటికే కొన్ని పరిశ్రమలు మూతపడ్డాయని, అనేక పరిశ్రమలు 40% కంటే తకువ సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, ముఖ్యంగా పటాన్చెరు, జీడిమెట్ల, మెడ్చల్, సంగారెడ్డి, నల్లగొండలో అనేక యూనిట్లను నడపలేని దుస్థితి.
రాష్ట్రంలో పరిశ్రమలకు ఎదురవుతున్న ఇబ్బందులు కార్మికులపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే అనేక పరిశ్రమల్లో కార్మికుల సంఖ్యను కుదించడంతోపాటు పనిగంటలు, వేతనాల్లో కోత విధించినట్టు కార్మిక సంఘాలు చెప్తున్నాయి. పారదర్శక విధానాలతో పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయాలని, ఖాయిలా పరిశ్రమల పునరుద్ధరణకు ప్యాకేజీలు ఇవ్వాలని, పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కల్గించాలని కోరుతున్నారు.
రాష్ట్రంలో గత రెండేండ్ల నుంచి తయారీ రంగం గణనీయంగా బలహీనపడినట్టు గణాంకాలు, నివేదికలు పేర్కొంటున్నాయి. పెట్టుబడులు తగ్గడం, పర్యావరణ నియమాలను కట్టుదిట్టంగా అమలు చేయడం తదితర అంశాలు ఇందుకు కారణమని స్పష్టమవుతున్నది. రాష్ట్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన ‘తెలంగాణ ఎకనమిక్ పల్స్ 2024’ నివేదిక ప్రకారం.. రాష్ట్ర పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధిరేటు 2023-24తో పోలిస్తే నిరుడు 2% వరకు తగ్గింది. బీఆర్ఎస్ హయాంలో 185-190 పాయింట్లుగా నమోదైన ఐఐపీ సగటు వృద్ధిరేటు గత రెండేండ్లుగా 185 పాయింట్లలోపే కొనసాగుతున్నది.
గత రెండేండ్ల నుంచి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చేపడుతున్న చర్యలు కూడా పరిశ్రమలపై ప్రభావం చూపుతున్నాయి. కాలుష్య నియమాలను ఉల్లంఘించాయన్న కారణంతో 2024 జనవరి నుంచి 2025 అక్టోబర్ మధ్య 305 పరిశ్రమలు మూతపడ్డాయి.
పెట్టుబడుల విషయంలో కూడా రాష్ట్రం తీవ్రమైన ఒత్తిడిని ఎదురొంటున్నది. టీజీ-ఐపాస్ ద్వారా 2023-24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు రూ.28,100 కోట్ల పెట్టుబడులు రాగా.. 2024-25లో అవి రూ.13,730 కోట్లకు పడిపోయాయి. ఈ భారీ క్షీణత కొత్త పరిశ్రమల ఏర్పాటును, ఇప్పటికే ఉన్న పరిశ్రమల విస్తరణను తీవ్రంగా ప్రభావితం చేసినట్టు నిపుణులు చెప్తున్నారు.
గతంలో బీఆర్ఎస్ సర్కారు టీఎస్-ఐపాస్ ద్వారా ప్రగతిశీల పారిశ్రామిక విధానాలను అమలు చేయడం, పరిశ్రమల ఏర్పాటుకు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను కల్పించడంతో పెట్టుబడిదారులకు తెలంగాణ స్వర్గధామంగా నిలిచింది. దీంతో దేశంలోనే ప్రధాన తయారీ కేంద్రంగా రాష్ట్రం రూపాంతరం చెందింది. తద్వారా ఫార్మా, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఏరోస్పేస్, టెక్స్టైల్స్, ఫుడ్‌ప్రాసెసింగ్ తదితర రంగాల్లో తయారీ కార్యకలాపాలు అత్యంత వేగంగా పుంజుకున్నాయి. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ నిరంతరం అగ్రస్థానాల్లో కొనసాగింది. ఫాక్స్‌కాన్, టాటా, అమరరాజా, డెకన్ ఫైన్ కెమికల్స్ వంటి ప్రధాన కంపెనీలతోపాటు పలు అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో తమ యూనిట్లను ఏర్పాటుచేసి పారిశ్రామిక విస్తరణకు తోడ్పడ్డాయి. జహీరాబాద్ వద్ద మొబిలిటీ, ఎలక్ట్రిక్ వాహన తయారీ క్లస్టర్లు, ఆదిభట్లలో ఏరోస్పేస్ యూ నిట్లు తయారీ రంగాన్ని బలపర్చాయి.