హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 19 (నమస్తే తెలంగాణ): ఈ నెల 21న జరిగే క్యాబినెట్ భేటీలో పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించి, ఉద్యోగులకు పర్మినెంట్ జీతభత్యాలు, భరోసా విషయంలో స్పష్టత ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వంగపల్లి మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ, గ్రామీణ మున్సిపాలిటీల్లో నూటికి 80 శాతం దళిత అణగారినవర్గాల వారే విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించినప్పుడే ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అవుతుందని చెప్పారు. కార్మికులకు నెలకు రూ.5000 పింఛన్ ఇవ్వాలని, నాలుగో తరగతి ఉద్యోగులుగా వారిని గుర్తించి పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఎమ్మార్పీఎస్ వారికి అండగా ఉంటుందని తెలిపారు. సమావేశంలో ఆ సంఘం నాయకులు దయాకర్ కాసర్ల, సురేశ్, విద్యార్థి నాయకులు కొల్లూరు వెంకట్, వరిగడ్డి చందు, జీవన్, ధర్మారం, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.