హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ తాము నిర్మించిన భవనానికి విద్యుత్తు కనెక్షన్ కోసం దరఖాస్తు చేసింది. ‘మీది బహుళ అంతస్థుల భవనం. కనుక మీరు చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ జనరల్ (సీఐఈజీ) అనుమతి తీసుకోవాల’ని డిస్కం అధికారులు సెలవిచ్చారు. సీఈఐజీ అనుమతి కోసం డ్రాయింగ్ చలాన్, ఇన్స్పెక్షన్ ఫీజు కట్టి, ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. నెలలు గడిచాయి. అధికారులు రారు, తనిఖీ చేయరు, అనుమతినివ్వరు. విద్యుత్తు కనెక్షన్ జారీకాదు. మరో సంస్థ అప్రూవల్ కోసం దరఖాస్తు చేసింది.
ఆఫీసుకు వెళ్లాక. ‘మీ ఫైల్‌పై ‘ఏ’ గ్రేడ్ లైసెన్స్డ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ సంతకం లేదు. చేయించుకుని రండి’ అని చెప్పారు. సంతకం చేయించుకొచ్చాక ‘సూపర్వైజర్ పర్మిట్ కావాలి, తనిఖీ చేసేటప్పుడు సూపర్వైజర్ ప్రత్యక్షంగా ఉండాల’ని మరో ఆర్డర్. సూపర్వైజర్ వచ్చాక 11కేవీకి ఒకరు.. 33కేవీకి ఇద్దరు సూపర్వైజర్లు ఉండాలన్నారు. ఇది కూడా అయిపోయిది. చివరికి ఎర్తింగ్ ఉందా? ఎర్త్ పిట్లు ఉన్నాయా? అంటూ మరో తిరకాసు. విసిగిపోయిన సదరు సంస్థ ప్రతినిధులు ఇవన్నీ ఎందుకు సార్ మీ ఫార్మాలిటీస్ చూసుకుంటాం లెండి ! అనగానే ఫైల్ అప్రూవ్ అయింది.
ఓ ఇండస్ట్రీ ఫైల్ అప్రూవల్ పనిని కన్సల్టెన్సీ తీసుకుంది. ఈ ఫైల్లో ఈ పేపర్ లేదు, ఆ పేపర్ లేదు. మొత్తం లోపాలున్నాయి. రూల్ ప్రకారం లేదు? అంటూ భయపెట్టారు. ఆ సార్‌కు ఇంత, ఈ సార్‌కు ఇంత.. మొత్తం రూ. 3.5 లక్షలవుతుందని బేరానికి దిగారు. దీనికి ఒకే అంటే రెండు రోజుల్లో ఫైల్ అప్రూవల్ వచ్చేస్తుందన్నారు. ఈ తిప్పలన్నీ ఎందుకని సదరు ఇండస్త్రీ ఒకే అని, చెప్పినంత సమర్పించుకోవడంతో ఫైల్ మెరుపువేగంతో కదలింది. ఇన్స్పెక్షన్ పూర్తయింది. 24 గంటల వ్యవధిలో అన్ని అనుమతులొచ్చేశాయి.
చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ జనరల్ (సీఐఈజీ) కార్యాలయంలో జరుగుతున్న తంతు ఇది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారిని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, చిన్న తరహా ఇండస్ట్రీలను దడదడలాడిస్తున్న తీరు. సీఈఐజీ కార్యాలయంలో కన్సల్టెన్సీల రాజ్యం నడుస్తున్నది. 25 కన్సల్టెన్సీలు, మరికొందరు ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లు సీఈఐజీ కార్యాలయాన్ని శాసిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఆఫీసు సిబ్బంది మీ పనికావాలంటే ఫలానా కన్సల్టెన్సీని, ప్రైవేట్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లను కలవాలని చెప్తున్నారు.
రాష్ట్రంలోబహుళ అంతస్తుల భవనాలు, ఐటీ కంపెనీలు, భారీ, చిన్న తరహా పరిశ్రమలు, థియేటర్లు, షాపింగ్స్ మాల్స్ అన్నింటికీ విద్యుత్తు కనెక్షన్ ఇచ్చే ముందు సీఈఐజీ అనుమతులు తప్పనిసరి. హెచ్‌టీ 56 కిలోవాట్స్ దాటితే సీఈఐజీ అనుమతి తీసుకోవాల్సిందే. సీఈఐజీ అనుమతి ఉంటేనే డిస్కం అధికారులు విద్యుత్తు కనెక్షన్ జారీచేస్తారు. వాస్తవానికి చాలామందికి సీఈఐజీ అనేది ఒకటి ఉన్నదన్న విషయం కూడా తెలియదు. కానీ నిర్మాణాలు పెరుగుతుండటంతో ఈ ఆఫీసుకు డిమాండ్ వచ్చిపడింది. రాష్ట్రం మొత్తానికి సీఈఐజీ సహా డిప్యూటీ సీఈఐజీలున్నాయి.
హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం ఉండగా, ఇక్కడ ఇన్స్పెక్టర్ జనరల్ ఉంటారు. హైదరాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, సికింద్రాబాద్, మెదక్, రంగారెడ్డిలలో డిప్యూటీ సీఈఐజీ కార్యాలయాలున్నాయి. వీటికి డిప్యూటీ ఇన్స్పెక్టర్లు లేరు. ఇన్స్పెక్టర్ జనరల్ ఆయా కార్యాలయాలకు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. అంటే మొత్తం రాష్ట్రమంతటికీ ఒక్కరే అధికారి. ఆయన తనిఖీలు చేయాల్సి ఉంది., ఇదివరకు పనిచేసిన అధికారి రిటైర్ కాగా, పలువురు ఈ సీటుపై కర్చీఫ్ వేసేందుకు సమాయత్తమవుతున్నారు.
విద్యుత్తు వినియోగదారులు ఐఎస్ఐ సర్టిఫైడ్ విద్యుత్తు ఉపకరణాలనే వాడాలి. అయితే నిర్మాణ సంస్థలు, కంపెనీలు, పరిశ్రమలు విద్యుత్తు పనులను ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నాయి. అవగాహన లేక.. నైపుణ్యం గల వర్కర్లు దొరక్క కాంట్రాక్టర్ల చేతిలో పెడుతున్నాయి. కొందరు కాంట్రాక్టర్లు లాభాల కోసం నాసిరకం కేబుళ్లు, ఎంసీబీలు, బ్రేకర్లు, ఆర్సీసీబీలు, ఎర్తింగ్ రాడ్లను వాడుతున్నారు. విద్యుత్తు లోడ్, వోల్టేజీ సామర్థ్యానికి తగినట్లు కేబుళ్లు వాడటం లేదు. వీటిని సీఈఐజీ అధికారులు తనిఖీ చేసి సరిచేయాలి. లోపాలుంటే సరిదిద్దాలి. అయితే ఇలా జరగడంలేదు. కన్సల్టెన్సీలు ఇచ్చిన ముడుపులను స్వీకరించి, కండ్లు మూసుకుని అనుమతులిచ్చేస్తున్నారు.
ఏడాదికోసారి పీరియాడికల్ ఇన్స్పెక్షన్లు నిర్వహించాలి. తనిఖీల పేర ఇలా వెళ్లి అలా వచ్చి అంతా ఒకే చెప్పేస్తున్నారు. లంచాలు పుచ్చుకుని మమ అనిపించేస్తున్నారు. ఇటీవలీ కాలంలో నాసికరం ఉపకరణాలు వాడటంతో భారీ భవనాల్లో షార్ట్సర్క్యూట్లు, విద్యుత్తు ప్రమాదాలు అధికమవుతున్నాయి. భవనాలకు భవనాలే కాలిపోతున్న సందర్భాలనేకం వెలుగుచూశాయి. ఈ ఒక్క నిర్లక్ష్యం ఫలితంగా కోట్లల్లో ఆస్తినష్టం జరుగుతున్నది. విలువైన ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఇవేవి పట్టని సీఈఐజీ అధికారులు, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లు, కన్సల్టెన్సీలు ముగ్గురూ కలిసి వినియోగదారులను మోసం చేస్తున్నారు.